Thursday, April 25, 2024

రేపు చలో రాజ్‌భవన్ కి కాంగ్రెస్ పిలుపు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రత్యేక్ష పోరుకు సిద్ధమైయ్యారు. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా హైదరాబాద్​లో రేపు చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ధర్నా చౌక్ నుంచి చలో రాజ్‌భవన్ కార్యక్రమం ఉంటుందని టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులంతా తరలిరావాలి రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణుల్ని అడ్డుకుంటే పోలీస్‌స్టేషన్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. పోలీసులు అడ్డుకోవడం, కేసులు పెట్టడం నిత్యకృత్యమైందని మండిపడ్డారు. ధరల పెరుగుదలపై పార్లమెంటులో కేంద్రాన్ని ఎండగడతామన్నారు. పెట్రోల్, డీజిల్ పై పన్ను విధిస్తూ.. పేదల నడ్డి విరుస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రజలు బతకడానికే కష్టమవుతున్న సందర్భంలో కూడా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం మాత్రం మానేయలేదన్నారు.

హైదరాబాద్​లో పెట్రోల్ ధర 105 రూపాయలు దాటిందన్నారు. వాస్తవంగా పెట్రోల్ ధర రవాణా ఛార్జీలు, డీలర్ల కమీషన్లతో సహా అన్ని కలిపితే 40 రూపాయలు మాత్రమే అని తెలిపారు. 40 రూపాయల ఇంధనాన్ని 65 రూపాయలు అదనంగా కలిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల వద్ద నుంచి దోచుకుంటున్నాయని రేవంత్ మండిపడ్డారు. 32 రూపాయలు కేసీఆర్ దోచుకుంటే… 33 రూపాయలు నరేంద్ర మోదీ దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ నుంచి రాజ్ ​భవన్​ వరకు నిరసన తెలపడానికి కార్యక్రమం తీసుకున్నామన్నారు.పేదలు, అన్ని వర్గాల ప్రజలు, పార్టీలకతీతంగా ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపాలని రేవంత్ కోరారు.

మరోవైపు చలో రాజ్‌భవన్‌కు ఇప్పటివరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ నేతలు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ.. పోలీసులు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. శాంతి భద్రతల కారణంగా అనుమతివ్వలేమని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement