Tuesday, September 21, 2021

కేసీఆర్ ఒక్కడే మొనగాడా?.. మునగోడుకొస్తే ఖబడ్దార్: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్

చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీకి వచ్చిన మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే శత్రువులా చూస్తారా? అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించరా? అంటూ నిప్పులు చెరిగారు. రెండున్నరేళ్లలో ఫోన్ చేసినా దొరకని మంత్రి.. ఈరోజు ఎలా వచ్చారంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మునగోడు సమస్యలు వంద చెబితే కనీసం స్పందించని మంత్రి.. రేషన్ కార్డులు, కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రం ఓడిపోయిన ఎమ్మెల్యేను వెంటేసుకుని వచ్చేస్తాడని విమర్శించారు. రాజకీయాలు వద్దని చెబితే కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తెచ్చినట్లు మాట్లాడుతున్నారని తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. ఆనాడు పార్లమెంట్‌లో.. సోనియా గాంధీతో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఒక్కడే మొనగాడా? కేసీఆర్ ఒక్కడే అనుకుంటే తెలంగాణ వచ్చిందా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అహంకారానిక పోతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. హుజూరాబాద్‌కి 2 వేల కోట్లు తీసుకపోతుంటే.. జిల్లాకి కనీసం 200 కోట్లు తెచ్చావా? అని మంత్రిని సూటిగా ప్రశ్నించారు. సిరిసిల్ల‌, సిద్దిపేట‌, గ‌జ్వేల్‌కో న్యాయం.. న‌ల్ల‌గొండ‌కో న్యాయ‌మా అని ఆయన నిలదీశారు. మంత్రి జగదీష్ రెడ్డికి దమ్ముంటే సీఎం కేసీఆర్ దగ్గర కొట్లాడాలని హితవు పలికారు. సైరన్ కార్లేసుకుని.. చెంచాగాళ్లని వెనకబెట్టుకుని తిరిగడం కాదని.. మళ్లొకసారి మునగోడుకొస్తే ఖబడ్దార్ అంటూ మంత్రికి కోమటిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News