Wednesday, April 24, 2024

దళిత వర్గానికే కాంగ్రెస్ టికెట్?

హుజురాబాద్ ఉపఎన్నికతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విషయంలో స్పష్టత రాగా.. కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుంది? అన్నది ఉత్కంఠగా మారింది. హుజురాబాద్ బరిలో దింపే అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళిత సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్‌లు బీసీ సామాజిక వర్గం అభ్యర్ధిని బరిలోకి దింపితే.. కాంగ్రెస్ మాత్రం దళిత సామాజికవర్గం అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావిస్తోంది.

కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజానర్సింహలకు పీసీసీ చీఫ్ రేవంత్ అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్న నాయకులు, వారి బలాబలాలు, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓటింగ్ తదితర అంశాలపై దృష్టి పెట్టారు. టీఆర్ఎస్, బీజేపీలను ఢీకొట్టే అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది. హుజురాబాద్ లో కాంగ్రెస్ తరుపున గతంలో కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. అయితే, మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో రెడ్డి సామాజిక వర్గానికే మరోసారి కాంగ్రెస్ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే అభ్యర్థిగా ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉంది.

హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు రెండు లక్షలపైగా  ఓటర్లున్నారు. ఇందులో బీసీ సామాజిక వర్గం ఓటర్ల తర్వాత దళిత సామాజికవర్గానికి చెందినవారు సుమారు 40 వేలకు పైగా ఉంటారని అంచనా. దళిత సామాజికవర్గం ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు అంశాన్ని తెరమీదికి తెచ్చింది. ఈ పథకాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ తరుణంలో దళిత సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బరిలోకి దింపాలని తెలంగాణ కాంగ్రెస్  నాయకత్వం భావిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 60 వేల ఓట్లు సాధించింది. దళిత సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపడం ద్వారా రాజకీయంగా టీఆర్ఎస్‌పై పైచేయి సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement