Friday, April 26, 2024

కౌశిక్ రెడ్డికి టిఆర్ఎస్ టికెట్.. మరి కాంగ్రెస్ సంగతేంటి?

హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ధీటైన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ పార్టీ అన్వేషిస్తోంది. ఈటల టీఆర్ఎస్ కు  రాజీనామా అనంతరం హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎవ‌రు ? అన్న ప్రశ్న మొదలైంది. రోజుకో నేత పేరు వినిపిస్తున్నా… కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ తో స‌మావేశం అయిన త‌ర్వాత కౌశిక్ ను టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలో దించ‌నున్న‌ట్లు ప్రచారం జరిగింది. అయితే, కౌశిక్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ లో చేరిక‌ను ఖండించారు. కొత్త పీసీసీ అధ్యక్షుడి రేవంత్ రెడ్డితో స‌మావేశం అయి తాను కాంగ్రెస్ లోనే ఉన్నాననే సంకేతాన్ని ఇచ్చినా.. కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఆయనపై అనుమానంగానే ఉన్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ హుజూరాబాద్ టికెట్ తనకే అంటూ పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణ కలకలం రేపుతోంది.

టీఆర్ఎస్ టికెట్ తనకే అని… యూత్‌కి ఎన్ని డబ్బులు కావాలో తాను చూసుకుంటానని…యూత్ సభ్యులకు 2000, 3000 ఇద్దామంటూ మాదన్నపేటకు చెందిన యువకునితో కౌశిక్‌రెడ్డి ఫోన్‌‌లో సంభాషించారు. ప్రస్తుతం కౌశిక్‌రెడ్డి ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కౌశిక్ రెడ్డి వ్యవహారం హుజురాబాద్ లో కొత్త చర్చ దారి తీసింది. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థికి టీఆర్ఎస్ డబ్బులు ఇచ్చిందని అనేక సందర్భాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు బలాన్ని చేకూరుస్తున్నాయి. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి సమీప బంధువు. దీంతో కౌశిక్ వ్యవహారం వెనుక ఉత్తమ్ కూడా ఉన్నారనే ప్రచారం మొదలైంది.

మరోవైపు కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందించింది. పాడి కౌశిక్ రెడ్డికి టీసీసీ క్రమశిక్షణ సంఘం షో కాజ్ నోటీస్ జారీ చేసింది. పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు అందిడంతో ఆయనపై చర్యలకు ఉక్రమించినట్లు క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీ కోదండరెడ్డి తెలిపారు. గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించినా ఆయనలో మార్పు రాలేదని చెప్పారు. 24 గంటల్లోగా ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీస్ లో పేర్కొంది. లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మొత్తం మీద కౌశిక్ రెడ్డి ఆడియో వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement