Thursday, March 28, 2024

కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రాజీనామా!

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై సంచలనంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ లో ఆపార్టీపై పోటీ చేయనున్నారని సమాచారం.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకే ఖరారైందని కౌశిక్ రెడ్డి ఓ కార్యకర్తలో మాట్లాడిన ఆడియో వ్యవహారం కలకలం రేపింది. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. కౌశిక్ రెడ్డి ఆడియో టేప్ బయటకు వచ్చిన తరువాత టీపీసీసీ ఆయనపై సీరియస్ అయ్యింది. వెంటనే ఆయనకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. కౌశిక్ రెడ్డి ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ హెచ్చరించింది.

మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీపీసీసీకి లేఖ రాయడంతో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకునేందుకే సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్టీ తనపై చర్యలు తీసుకోవడానికి ముందుగానే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. తనకు నోటీసులు జారీ అయిన తర్వాత తన సన్నిహితులతో సమావేశం అయిన కౌశిక్ రెడ్డి.. రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ కు పంపారు. గతంలో హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఈటల చేతిలో ఓటమిపాలైన పాడి కౌశిక్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఇప్పడు అభ్యర్దిగా నిలబెడుతుందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడంతో అప్పటి నుంచే ఆయన పార్టీ మారుతారే ప్రచారం జరుగుతోంది. అయితే, అనూహ్యం ఆడియో టేప్ లీక్ కావడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి.

ఇది కూడా చదవండి: ఉత్త‌రాదిలో పిడుగులు.. 68 మంది మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement