Friday, March 29, 2024

దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకివ్వరు?

దళితుల మనోభావలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే కేసీఆర్ కు దళితుల ఆత్మగౌరవం గుర్తుకు వస్తుందని విమర్శించారు. దళితున్ని సీఎం చేస్తా అన్న కేసీఆర్ మాట తప్పి.. ఆయనే సీఎం కుర్చీపై కూర్చున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో దళితునికి డిప్యూటీ సీఎం ఇచ్చిన కేసీఆర్.. రెండో ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కొప్పుల ఈశ్వర్ ఉపముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కొప్పుల ఈశ్వర్ డిప్యూటీ సీఎం పదవికి అర్హత లేదా? అని నిలదీశారు. మరో దళిత నేత అరూరి రమేష్ కు ఎందుకు పదవి ఇవ్వరని? అడిగారు.

15శాతం రిజర్వేషన్లలో ముగ్గురు మంత్రులు ఇవ్వాల్సిన కేసీఆర్- ఒక్కరికే అవకాశం కల్పించారన్నారు. దళితుల భావాలను కేసీఆర్ కించపర్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో దళితులపై ప్రేమ ఉన్నట్లు విశ్వసనీయత కనపడటం లేదన్నారు. మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మాట తప్పారని గుర్తు చేశారు. ఏకరానికి 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో 2లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ చెప్పిందని అన్నారు. ఉద్యోగాల భర్తీ చేయకుండా దళితులను మోసం చేస్తూ దళిత బంధు అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏడేళ్ల కాలంలో ఏ ఒక్క ఏడాది కూడా దళితులకు కేటాయించిన బడ్జెట్ పూర్తిగా ఖర్చు చేయలేదన్నారు. 35వేల కోట్లు కేసీఆర్ ఖాజానలో పెట్టుకోని దళితుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళిత నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. దళితులకు ఇస్తున్న రూ.10 లక్షలు కేసీఆర్ జేబులో నుంచి ఇవ్వడం లేదని తెలిపారు. ఏడేళ్ల కాలంలో దళితుల్ని అవమానించి ఇప్పుడు 10లక్షలు ఇస్తే సరిపోతుందా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల సమస్యలు పరిష్కరించే వరకు ఓట్లు అడిగే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. మాట తప్పితే తల నరుక్కుంటానన్న కేసీఆర్ కు… రావణాసుడుకి ఉన్నట్లు ఎన్ని తలకాయలు ఎన్నాయో అని జీవన్ రెడ్డి విమర్శించారు.

ఇది కూడా చదవండి: వైసీపీ వేధింపులకు చెక్.. తెలుగు తమ్ముళ్ల కోసం లోకేష్ ముందడుగు

Advertisement

తాజా వార్తలు

Advertisement