Wednesday, April 24, 2024

సేవలకు గుర్తింపు.. వలంటీర్లకు సత్కారం!

ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వలంటీర్లలకు ఏపీ ప్రభుత్వం సత్కరించనుంది. వలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి నిర్వహించనుంది. ప్రతి జిల్లాలో రోజుకొక అసెంబ్లీ నియోజకర్గం చొప్పున ఏప్రిల్‌ 28వతేదీ వరకు వలంటీర్లకు సత్కార కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

వలంటీర్ల పనితీరు ఆధారంగా సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో మూడు కేటగిరీల్లో సత్కరించనున్నారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నగదు బహుమతితో పాటు మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జిలను వలంటీర్లకు అందజేస్తారు. తొలిరోజు 11 జిల్లాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికల నేపథ్యంలో చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని మే 4వతేదీ తర్వాత నిర్వహించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 13 అసెంబ్లీ నియోజక వర్గాలలో వివిధ అవార్డులకు ఎంపికైన వలంటీర్లకు నగదు ప్రోత్సాహకాన్ని సీఎం జగన్‌ పోరంకిలో జరిగే సమావేశం నుంచే కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తారని అధికారులు తెలిపారు. 

ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఏడాదికిపైగా సేవలందించిన వలంటీర్లను ‘సేవామిత్ర’ అవార్డుతో సత్కరించి రూ.10 వేల చొప్పున నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్‌ బహుకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,17,650 మంది వలంటీర్లను ఈ అవార్డుకు అర్హులుగా అధికారులు గుర్తించారు. కాగా,  రాష్ట్రవ్యాప్తంగా 2,66,092 మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 2019 ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement