Thursday, August 5, 2021

మరో 50 వేల ఉద్యోగాల కోసం కార్యాచరణ: సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సమీకృత అభివృద్ధి కార్యాచరణ సత్పలితాలనిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పలు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని, తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పన పెరుగుతున్నదన్నారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా తెలంగాణను రాష్ట్ర ప్ర‌భుత్వం తీర్చిదిద్దుతున్నదన్నారు. పట్టణాల్లో ఉపాధి రంగాలను మెరుగుపరిచే కార్యక్రమాలను అమలు చేస్తూ వాటి ఫలాలను యువతకు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు.

యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏడేళ్లుగా అమలు చేస్తున్న కార్యాచరణ కొలిక్కి వచ్చిందన్నారు. స్వరాష్ట్ర ఫలాలు యువత అనుభవించే పరిస్థితులు ఇపుడు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నాయని చెప్పారు. పరిశ్రమలు, ఐటీ రంగంలో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని సీఎం తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే లక్షా 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు. నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో స్పష్టత రావడంతో మరో 50 వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ ప్రారంభమైందని సీఎం చెప్పారు. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు సీం కేసీఆర్ ప్రకటించారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణ తెలిపారు. వ్యవసాయ రంగం నేటి యువతను కూడా ఆకర్షిస్తుండడం వెనక తెలంగాణ ప్రభుత్వ శ్రమ ఎంతో ఉందని అన్నారు.  మారిన పరిస్థితుల్లో యువత మరింత సమర్థంగా నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ యువత ఎంతో సమర్థవంతమైందని…  వారికి నైపుణ్యాలు తోడైతే తిరుగులేని యువశక్తిగా అవతరిస్తుందని పేర్కొన్నారు. ఐటీ, సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించే దిశగా తెలంగాణ నైపుణ్య పరిజ్జాన అకాడెమీ(టాస్క్) ని దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేసామన్నారు. తద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను అందిస్తున్నామన్నారు. యువతను ప్రోత్సహించేలా ఐటీ పాలసీని రూపొందించామన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News