Thursday, April 18, 2024

హుజురాబాద్ లో కేసీఆర్ కు ఆ 412 ఓట్లు ఖాయం

హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. క్యాస్ట్ పాలిటిక్స్ పై దృష్టి సారించిన కేసీఆర్.. హుజురాబాద్ ఓటర్లపై లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్ల రూపాయాలు విడదుల చేసిన సీఎం.. దళిత బంధు పథకంపై ఫోకస్ పెట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సోమవారం ఆ ప్రాంత వాసులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దళిత బంధు పథకం అమలు, కార్యాచరణపై తొలి అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు కలిపి నలుగురికి ఆహ్వానం అందింది. అలాగే ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున.. మొత్తం 412 మంది దళిత పురుషులు మహిళలు ఈ సదస్సులో పాల్గొంటారు. వారితో పాటు 15 మంది రిసోర్సు సిబ్బంది కూడా పాల్గొంటారు. మొత్తం 427 మంది హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులు ఈ అవగాహన సదస్సులో పాల్గొనున్నారు.

అయితే, ఈ సమావేశం ఓ హుజురాబాద్ ఉప ఎన్నిక స్టంట్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హుజురాబాద్ లో ప్రధానంగా బీసీ ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇక, రెడ్డి, ఎస్సీ ఓట్లు కీలకం కానున్నాయి. ఈటలకు బీసీ సామాజిక వర్గాల్లో మంచి పట్టుంది. దీంతో బీసీ ఓట్లు టీఆర్ఎస్ పడతాయా? లేదా ? అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. ముందుకు హుజురాబాద్ లీడర్ కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. తద్వారా రెడ్డి సమాజిక వర్గం ఓట్లు టీఆర్ఎస్ కు  పదిలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఉపఎన్నికల్లో దళిత సామాజిక వర్గ ఓట్లు కీలకంగా మారాయి. దీంతో ఆయా వర్గానికి ప్రధాన్యం ఇవ్వడం కోసం సీఎం కేసీఆర్.. దళిత బంధుతో స్కెచ్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నిక ఏదైనా ఒక గెలపు ఓటములను ఒక్క ఓటే నిర్ణయిస్తుంది. సీఎం సమావేశానికి మొత్తంగా 412 మంది దళితులు హాజరవుతున్నారు. దీంతో ఆ ఓట్లు టీఆర్ఎస్ కే ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

హుజూరాబాద్‌‌లో మొత్తం 2.05 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో బీసీలు 1.02 లక్షలు. ఓసీ ఓటర్లు 40 వేలు, ఎస్సీ ఓటర్లు 52 వేలు, ఎస్టీ ఓటర్లు 2 వేలకుపైగా, మైనార్టీ ఓటర్లు 9 వేల మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో సగం మంది ఉన్న బీసీలపై కూడా టీఆర్‌‌ఎస్‌‌ ఫోకస్‌‌ పెట్టింది. మెజార్టీ కులాలైన పద్మశాలి, ముదిరాజ్‌‌, మున్నూరుకాపు, గౌడ, యాదవ, ఇతర బీసీ కులాల ఓట్లు టీఆర్‌‌ఎస్‌‌కు పడేలా ప్రణాళికలు రచిస్తోంది. ఆ కులాలకు చెందిన పార్టీ సీనియర్‌‌ నేతలను ఇక్కడ రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే పద్మశాలి ఓటర్లను గులాబీ పార్టీ వైపు తిప్పుకునేందుకే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌‌. రమణను పార్టీలోకి ఆహ్వానించారనే ప్రచారం జరుగుతోంది. ఈటల బలమైన బీసీ నేత కావడంతో ఆయా సామాజికవర్గాల నేతలతోనే ఆయనకు చెక్‌‌ పెట్టాలని టీఆర్​ఎస్​ ప్లాన్​ చేస్తోంది.  52 వేల ఓట్లు ఉన్న ఎస్సీలకు దళిత బంధు పకథంతో ఆకర్షించడం ద్వారా అన్ని వర్గాల ఓట్లు తమకే పడి మెజార్టీ సాధించాలన్నది కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది.

ఇదిఇలా ఉంటే.. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల బాధ్యతలను ఐదుగురు మంత్రులకు సీఎం కేసీఆర్ అప్పగించారు. సగానికిపైగా కేబినెట్‌ను హుజూరాబాద్‌లోనే మోహరించాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఉద్యమ నేతలందరికీ బైపోల్‌ టాస్క్‌ అప్పగించారు. ఎన్నిక పూర్తయ్యే వరకూ వారంతా మరో పని ముట్టుకోవద్దని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కూడా నియోజకవర్గంలో ఆధిపత్యం చాటేకుందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు గంగుల కమలాకర్‌తోపాటు టీఆర్ఎస్ నేతలు అందరూ హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉప‌ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేసేలా నిర్దేశం చేస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్  ఓట్ల లెక్కలపై సర్వత్ర ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇది కూడా చదవండి: కౌశిక్ రెడ్డికి కేసీఆర్ ఝలక్.. హుజురాబాద్ టికెట్ డౌటే?

Advertisement

తాజా వార్తలు

Advertisement