Friday, March 29, 2024

హుజురాబాద్ లో కేసీఆర్ రోడ్ షో.. బహిరంగ సభ రద్దయినట్టే!

హుజూరాబాద్​ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపుపైనే దృష్టి సారించాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఉపఎన్నికలో గెలుపుపై      అధికార టీఆర్ఎస్ గట్టి నమ్మకంతో ఉంది. ఎన్నిక ఏదైనా గెలుపు తమదే అన్న ధీమాతో గులాబీ నేతలు ఉన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యలో ఇప్పటికే నియోజకవర్గంలో హోరహోరి ప్రచారం సాగుతోంది. పార్టీ ముఖ్యనేతలంతా అక్కడే మకాం పెట్టారు. ట్రబుల్​ షూటర్​ హరీశ్​రావు ముందు నుంచే.. నియోజకవర్గాన్ని చుట్టేశారు. తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో ఫైనల్ టచ్ గా గులాబీబాస్ కేసీఆర్​ రంగంలోకి దిగనున్నారు.

అయితే, ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదనే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల విధించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వ్యూహం మార్చింది. ఉప ఎన్నిక జరిగే హుజూరాబాద్‌కు పొరుగున ఉన్న హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సభ సాధ్యం కాని పక్షంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే రెండు రోజుల పాటు రోడ్‌షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణంగా కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. దీంతో ఈనెల 27న పెంచికల్ పేటలో తలపెట్టిన కేసీఆర్ బహిరంగ సభ రద్దయినట్టే అని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ రోడ్‌ షో ఉండే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Huzurabad Bypoll: ఆ పార్టీలకు ఈసీ షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement