Thursday, April 25, 2024

యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి…ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆహ్వానం

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున:ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధాన పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో స్వయంభూ దర్శనానికి భక్తులను త్వరలో అనుమతించనున్నారు. పనులు తుది దశకు చేరిన నేపథ్యంలో ఆలయ పున:ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఆలయ ఉద్ఘాటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. త్వరలోనే ముహూర్తం ఖరారు చేయనున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ ఆలయ ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.

మరోవైపు అద్భుత పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం రూపుదిద్దుకుంటోంది. కాకతీయ శైలిలో శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా పూర్తిగా కృష్ణశిలతోనే ఆలయాన్ని పునరుద్ధరించారు. మండపాలు, ప్రాకారాలు, గోపురాలు, శిల్పాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మాడవీధులు ఉండేలా ఆలయాన్ని గుట్టపై పూర్తి స్థాయిలో విస్తరించారు. ప్రధాన ఆలయ పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి.

స్వామి వారి కైంకర్యాల కోసం కొండపై విష్ణుపుష్కరిణి సిద్దమైంది. గుట్ట నలువైపులా రహదార్ల విస్తరణ పనులు పూర్తి కాగా యాదగిరిగుట్ట పట్టణంలో నుంచి కొండ పైకి వెళ్లే రహదారి మార్గ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. గుట్ట, రహదారుల వెంట, పరిసరాల్లో పూర్తి స్థాయి పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ అభివృద్ధి, ఇతర పనుల కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 1200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement