Friday, March 29, 2024

ముగిసిన సీఎం కేసీఆర్‌ హస్తిన పర్యటన.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ రాక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఉత్తరాది రాష్ట్రాల పర్యటన ముగిసింది. జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు, సమాఖ్య స్ఫూర్తిపై చర్చించేందుకు ఢిల్లి వెళ్లిన సీఎం కేసీఆర్‌ అక్కడ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ నిపుణులతో పాటు పాత్రికేయ రంగంలో ప్రముఖులతో సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. తన నాలుగు రోజుల పర్యటనలో ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌సింగ్‌తో సహా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఢిల్లి సీఎం కేజ్రీవాల్‌తో కలిసి అక్కడి ప్రభుత్వం ప్రారంభించి ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న పాఠశాలలను, ఆసుపత్రులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయులను, వైద్యరంగ ప్రముఖులను ఢిల్లికి పంపించి అక్కడ అమలవుతున్న పథకాలను, కార్యక్రమాలను అధ్యయనం చేయిస్తామని ప్రకటించారు.

ఈనెల 20న హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లికి చేరుకున్న కేసీఆర్‌ అదే రోజు తుగ్లక్‌ రోడ్డులోని తన అధికారిక నివాసంలో వివిధ రంగాలకు చెందిన ముఖ్యులతో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించిన సంగతి విదితమే. ఢిల్లితో పాటు పంజాబ్‌, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బంగా, బీహార్‌ రాష్ట్రాల్లో కేసీఆర్‌ పర్యటించాలని తొలుత నిర్ణయించారు. హైదరాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ తిరిగి ఈనెల 26న బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి శివ కుమార్‌తో సమావేశమవుతారు. జాతీయ స్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయ ఏర్పాటుపై చర్చించి అక్కడే ఆ రోజు బస చేయనున్నట్లు తెలుస్తోంది. 27వ తేదీన అక్కడి నుంచి బయలుదేరి మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్దికి చేరుకుని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు.

గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతి, పట్టణాల కోసం అమలు చేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఆయనకు వివరిస్తారు. సాగునీటి రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను, తోడ్పాటును చెప్పడంతో పాటు ప్రపంచంలో ఎక్కడా నిర్మించని భారీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరంను రికార్డు స్థాయిలో మూడున్నరేళ్లలో పూర్తి చేసి వందలాది ఎకరాలకు సాగునీరు, వేలాది మంది దప్పిక తీరుస్తున్న వైనాన్ని కేసీఆర్‌ వివరించనున్నట్టు తెలుస్తోంది. వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటల పాటు మెరుగైన, కొతలు లేని విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు వారికి పెట్టుబడి సాయం కింద ఏటా రూ.10వేలు, చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించే అంశాన్ని కూడా సీఎం తన పర్యటనలో అన్నా హజారేకు చెప్పనున్నారు.

అన్నా హాజరేతో భేటీ అయ్యాక ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడి చేరుకుని సాయిబాబా దర్శనం చేసుకున్నారు. తిరిగి అదే రోజు హైదరాబాద్‌ వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం ఇది వరకే సీఎం పర్యటన వివరాలను తెలిపింది. ఈనెల 29 లేదా 30 తేదీల్లో పశ్చిమ బంగా, బీహార్‌ రాష్ట్రాల పర్యటనకు వెళ్లే అవకాశముంది. గాల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రభుత్వం ఇది వరకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని కేసీఆర్‌ అందజేస్తారు. పశ్చిమ బంగా, బీహార్‌ పర్యటనలలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీని కలిసే అవకాశముంది. ఢిల్లిdలో నాలుగు రోజులపాటు బస చేసి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఢిల్లి, పంజాబ్‌ సీఎంలను కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించిన అంశాలను మమతతో పంచుకునే అవకాశముంది. బీహార్‌కు వెళ్లే కేసీఆర్‌ అక్కడి ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు తేజస్వి యాదవ్‌తో కూడా సమావేశమయ్యే అవకాశముంది.
చర్చలు ఫలప్రదం

సీఎం కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్‌ పర్యటన విజయవంతమైందని తెరాస వర్గాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు తీసుకురావాలని దేశాభివృద్ధికి ప్రత్యేక ఎజెండా ఉండాలని కోరుకున్న సీఎం కేసీఆర్‌ ఇందుకు అవసరమైన పావులు కదిపారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్‌ అనుకున్నది సాధిస్తారని పట్టిన పట్టు వదలరని జాతీయ స్థాయిలో ఆయన అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా వెళుతున్నారని తొలి అడుగు విజయవంతమైందని తెరాస ఎంపీలు పేర్కొన్నారు. కేసీఆర్‌ రాష్ట్రానికి రాగానే కాంగ్రెస్‌, బాజపా నేతల్లో రైళ్లు పరిగెత్తాయని దీంతో వారికి ఏం చేయాలో తెలియక అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని తెరాస ఎంపీలు దుయ్యబడుతున్నారు.

- Advertisement -

హైదరాబాద్‌ వేదికగా జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం ఓ భారీ సదస్సును నిర్వహించాలన్న పట్టుదలతో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. ఢిల్లిలో తనతో భేటీ అయిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య నేత, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌తో సమావేశమైన సందర్భంగా తృతీయ కూటమి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆయన వివరించడంతో పాటు హైదరాబాద్‌లో మొదటి సమావేశాన్ని నిర్వహించడానికి ఇరువురు నేతలు సన్నద్ధమైనట్టు సమాచారం. ఇదే విషయాన్ని కేజ్రీవాల్‌తో కూడా సీఎం కేసీఆర్‌ చెప్పారని అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశానికి ముందు విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో కూడా హైదరాబాద్‌లో మరో కీలక భేటీని నిర్వహించే ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లిలో ఉండగానే ఈ అంశంపై ఆయన పలువురు విశ్రాంత అధికారులతో మాట్లాడారని హైదరాబాద్‌ సమావేశానికి ఆహ్వానం పలికారని తెలుస్తోంది. మొత్తం మీద సీఎం కేసీఆర్‌ హస్తిన పర్యటన విజయవంతమైందని ఇకనుంచి తమ అధినేత పూర్తి సమయాన్ని జాతీయ రాజకీయాలపైనే దృష్టి సారిస్తారని తెరాస ఎంపీలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement