Friday, March 29, 2024

తిరుపతి ప్రచారాని సీఎం జగన్ దూరం.. లేఖలో కారణం!

తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తరుపున సీఎం జగన్ ప్రచారం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, సీఎం జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్‌ ఓటర్లకు జగన్‌ బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాలేకపోతున్నానని, 24 గంటల్లో కరోనాతో మరణించిన 11 మందిలో.. నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లాలో కూడా ఒక్కరోజులోనే 292 కేసులు వచ్చాయన్నారు.

తాను సభకు హాజరైతే వేలాది మంది వస్తారని, మళ్లీ కోవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. బాధ్యతగల సీఎంగా తిరుపతిలో సభ రద్దు చేసుకుంటున్నానని, ఇటీవల తాను రాసిన లేఖలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ వివరించానన్నారు. వాటిని గమనించి తమ పార్టీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని సీఎం జగన్ తిరుపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో బల్లి దుర్గాప్రసాద్ కు ఇచ్చిన మోజారిటీ(2.28 లక్షల)కన్నా ఇంకా ఎక్కువగా.. ఫ్యాన్ గుర్తుమీద ఓట్లు వేస్తారని, ప్రతి ఒక్కరూ మరో నలుగురితో తమ అభ్యర్థి గురుమూర్తికి తిరుగులేని మెజారిటీతో గెలిపించేలా ఓట్లు వేయిస్తారని ఆశిస్తూన్నట్లు సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement