Friday, March 29, 2024

గండం తప్పింది.. హిందూ మహాసముద్రంలో కూలిన చైనా అతిపెద్ద రాకెట్

కొన్ని రోజులుగా నియంత్ర‌ణ కోల్పోయి భూమిపై ఎక్క‌డ కూలుతుందా అని టెన్ష‌న్ పెట్టిన చైనాకు చెందిన అతిపెద్ద రాకెట్ హిందూ మ‌హాస‌ముద్రంలో కూలిపోయింది. భూ వాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించిన త‌ర్వాత త‌న భాగాల‌ను చాలా వ‌ర‌కూ కోల్పోయిన రాకెట్‌.. చివ‌రికి స‌ముద్రంలో కూలిపోయిన‌ట్లు చైనా మీడియా వెల్ల‌డించింది. బీజింగ్ కాల‌మానం ప్ర‌కారం ఆదివారం ఉద‌యం 10:24 గంట‌లకు (భార‌త కాలమానం ప్రకారం ఉద‌యం 07:54 గంటలకు) లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భూవాతావ‌ర‌ణంలోకి తిరిగి ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్త‌ర అక్షాంశాల ద‌గ్గ‌ర కూలిపోయిన‌ట్లు చైనా మ్యాన్డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ వెల్ల‌డించిన‌ట్లు చైనీస్ మీడియా తెలిపింది.

భూవాతావ‌ర‌ణంలోకి రాగానే చాలా వ‌ర‌కూ రాకెట్ శ‌క‌లాలు బూడిదైపోయాయి. గ‌త నెల 29న లాంగ్ మార్చ్ 5బీని చైనాలోని హైన‌న్ దీవి నుంచి నింగికి ఎగిసింది. వెంట‌నే అది నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో అది భూమిపై ఎక్క‌డ కూలుతుందో అన్న ఆందోళ‌న క‌లిగింది. 5బీ వేరియెంట్‌లో ఇది రెండో రాకెట్‌. గ‌తేడాది మేలో పంపిన తొలి రాకెట్ ఐవ‌రీ కోస్ట్‌లో కూలింది. అప్పుడు కొన్ని భ‌వ‌నాలు దెబ్బ‌తిన్నాయి. కానీ ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదు. నిజానికి భూమిపై ఎక్కువ భాగం నీళ్లే ఉండ‌టం వ‌ల్ల ఇలాంటి రాకెట్లు జ‌నావాసాల‌పై ప‌డ‌టం చాలా చాలా అరుదు అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈసారి చైనా ఈ రాకెట్ క‌చ్చితంగా స‌ముద్రంలోనే కూలుతుంద‌ని ప్ర‌పంచానికి హామీ ఇవ్వ‌లేక‌పోవ‌డంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement