Friday, April 19, 2024

చిన్నారుల‌కు చికెన్‌పాక్స్‌.. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో బాధితులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కరోనా మూడు వేవ్‌ల నుంచి పేషెంట్లతోపాటు తమను తాము సురక్షితంగా కాపాడుకోగలిగామన్న వైద్యులను కొద్దిరోజులుగా మరో వ్యాధి వ్యాప్తి కలవరపెడుతోంది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో కొద్ది రోజులుగా చికెన్‌ పాక్స్‌(అమ్మవారు) కేసులు పెరుగుతున్నాయి. అమ్మవారు సోకడంతో నీలోఫర్‌ ఆసుపత్రితోపాటు రాష్ట్ర వ్యాప్తంగాఉన్న పలు ఆసుపత్రుల్లో చేరుతున్న కేసులు పెరుగుతున్నాయి. ప్రతి ఏటా ఎండా కాలంలో చికెన్‌ పాక్స్‌ సోకిన కేసులు ఒకటి, రెండు నమోదవడంపరిపాటే. కాని ఈ సారి మాత్రం హైదరాబాద్‌తోపాటు కొన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో చికెన్‌ పాక్స్‌ కేసులు వస్తున్నట్లు నీలోఫర్‌ ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రతి రెండేళ్ల కోసారి చికెన్‌ పాక్స్‌ కేసులు పెద్ద సంఖ్యలో వస్తుంటాయని, ఆ క్రమంలో ఈ ఏడాది కూడా ఎక్కువగా వస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న మే నెలలో ఈ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. గడిచిన నెలన్నర రోజులుగా ప్రతీ వారం రెండు నుంచి మూడు చికెన్‌ పాక్స్‌ కేసులు నమోదవుతున్నాయని ఫీవర్‌ ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.

హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం ఒక్కరైనా అమ్మవారు సోకడంతో చి కిత్స పొందుతున్నారు. ఇటీవల మెహిదీపట్నంలోని ఓఇంటర్‌ కాలేజీలో ముగ్గురు విద్యార్థులకు అమ్మవారు సోకినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలోనూ ఈ కేసులు వెలుగు చూస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. సాధారణంగా చికెన్‌ పాక్స్‌ ఆటలాడే చిన్నారుల నుంచి మొదలు ఇంటర్‌ చదివే విద్యార్థుల వరకు ఎక్కువగా సోకుతుంది. సాధారణంగా చికెన్‌ పాక్స్‌ వ్యాధిని అమ్మవారు పోసింది అని కూడా వ్యవహరిస్తుంటారు. ఇది ఆటలాడే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా ఈ వ్యాధి 2 నుంచి 8ఏళ్ల పిల్లలల్లోఎక్కువగా కనిపిస్తుంటుంది. కాని ప్రస్తుతుం చిన్న పిల్లలతోపాటు కొంత మంది పెద్దలు, గర్భీణీ మహిళలకు కూడా వస్తోంది.

చికెన్‌ పాక్స్‌ వచ్చిన వారి ఒంటిపై పొక్కులు, దద్దుర్లు కనిపిస్తాయి. అమ్మవారు సోకిన వారు దగ్గినపుడు, తుమ్మినపుడు గాలి, తుంపర్ల ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నపుడు అమ్మవారు ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఒంటిపై పొక్కులు, దద్దుర్లు పొడవగానే వెంటనే దగ్గర్లోని వైద్యుడినిసంప్రదించాలి. అమ్మవారు సోకిన చిన్నారులకు కాటన్‌ దుస్తులు మాత్రమే వేయాలి. వారిని బడికి పంపకూడదు. వైద్యులు సూచించిన మందులనే వాడాలి. రోగికి నిత్యం ద్రవరూప ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. ఆహారంలో ఉప్పు, మసాలాలు వీలైనంత తక్కువగా ఉండాలి. చికెన్‌ పాక్స్‌ బారిన ప్రతి ఏటా చిన్నారులు పడుతుంటే… వెంటనే వారికివ్యాక్సిన్‌ వేయించటం మర్చిపోవద్దు. చికెన్‌ పాక్స్‌ కు రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ ఇస్తారు. చిన్నారులకు 12-18 నెలల వయసులో మొదటి మోతాదును , 6ఏళ్ల వయసులో రెండో డోస్‌ను ఇస్తారు. పెద్దల్లోనూ రెండు మోతాదుల్లో … మొదటి , రెండోడోస్‌కు మధ్యన 4-8 వారాల వ్యవథిలో ఇస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement