Thursday, March 28, 2024

Spl Story | చదువుకుంటా, మా ఊరికి పంపించండి.. మత ఘర్షణలతో ఊరొదిలిన చిన్నారి ఆవేదన!

నా పేరు మొహంతి సలామ్.. నేను 9వ తరగతి చదువుతున్నా. మాది మారుమూల బోరవాండ్ గ్రామం. మత మార్పిడుల కారణంగా మమ్మల్ని ఊరు నుంచి వెలేశారు. అప్పటి నుంచి మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఉంటున్నాం. కానీ, నాకు మా ఊరికి తిరిగి వెళ్లాలని ఉంది. నా బుక్స్​, బట్టలన్నీ అక్కడే ఉన్నాయి.  ఎట్లయినా చేసి మమ్మల్ని మా ఊరికి పంపేలా చూడండి’’ అంటూ ఓ చిన్నారి కన్నీరుపెడుతూ వేడుకోవడం అందరినీ కలిచివేసింది. మతమార్పిడుల నేపథ్యంలో ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం నారాయణపూర్​ జిల్లాలో ఘర్షణలు చెలరేగాయి. బెనూరు ప్రాంతంలోని కుదర్‌గావ్‌, బోరవాండ్‌, భట్‌పాల్‌, భండపాల్‌ గ్రామాలకు చెందిన కుటుంబాలు ఊరొదిలి పారిపోయాయి. దీంతో విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తోంది.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

మత మార్పిడులకు  పాల్పడుతున్నారనే కారణంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో 21 రోజులుగా ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు అధికంగా ఉండే నారాయణ్‌పూర్ జిల్లాలో ప్రభుత్వం ఒక షెల్టర్ క్యాంపు ఏర్పాటు చేసింది. జిల్లాలో క్రైస్తవ, క్రైస్తవేతర వర్గాల మధ్య కొంతకాలంగా ఘర్షణ తలెత్తింది. ఆ తరువాత కొన్ని కుటుంబాలను ఊరి నుంచి గెంటేశారు. అయితే ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలోనే సలామ్​ కుటుంబాన్ని గ్రామం నుండి వెలివేయడంతో ఆమె తన పుస్తకాలు, బట్టలు కోల్పోయింది. చదువును కొనసాగించాలని.. పాఠశాలకు వెళ్లేందుకు తన గ్రామానికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

నారాయణపూర్ నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన షెల్టర్ క్యాంపులో నివసిస్తున్న 30 మందికి పైగా పిల్లలలో సలామ్​ కూడా ఉంది. వారి కుటుంబాలు క్రైస్తవ మతంలోకి మారినందుకు వారు గ్రామాలను వదిలి వెళ్లవలసి వచ్చింది. ఇది ఇప్పుడు వారి చదువులపై ప్రభావం చూపుతోంది. “మేము డిసెంబర్ 18 నుండి ఇండోర్ స్టేడియంలో నివసిస్తున్నాం. మమ్మల్ని మా గ్రామం నుండి వెలివేశారు. పుస్తకాలు, బట్టలు పోగొట్టుకున్నాం. నేను తిరిగి నా పాఠశాలకు ఎలా చేరుకోవాలో ఆలోచిస్తూ ఉంటాను. నేను చదువుకోవాలనుకుంటున్నా ”అని సలామ్ ఓ న్యూస్​ ఏజెన్సీకి చెప్పింది.  

Chhattisgarh. Religious. Clashes, Education. Affected,

బోరవండ్‌ గ్రామానికి చెందిన 11 మంది పాఠశాల విద్యార్థులు ఆశ్రమ శిబిరంలో కుటుంబ సమేతంగా ఉంటున్నారు. 2022 డిసెంబర్ 18 న నారాయణపూర్‌లోని బెనూర్ ప్రాంతంలోని 14 గ్రామాలకు చెందిన పెద్ద సంఖ్యలో గిరిజన క్రైస్తవ కుటుంబాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకు దిగాయి. క్రైస్తవ మతంలోకి మారినందకు తమపై కొంతమంది దుండగులు దాడి చేశారని, తమ గ్రామాల నుండి వెళ్లగొట్టారని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారిని తాత్కాలిక వసతి గృహాలకు తరలించి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. అయితే.. ప్రస్తుతం వారికి ఆశ్రయం లభించినా వారి మానసిక వేదన అంతంతమాత్రంగానే ఉంది. ఆశ్రమ శిబిరంలో నివసిస్తున్న పిల్లల తల్లిదండ్రులు పిల్లల చదువు ఎలా కొనసాగిస్తారోనని ఆందోళన చెందుతున్నారు.

”మా పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. మా ఇళ్లు ఖాళీ చేయాలని చూశారు. వారు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రజలను (గిరిజన క్రైస్తవులు) వారి ఇళ్ల నుండి తరిమివేస్తున్నారు” అని శిబిరంలో నివసిస్తున్న భట్‌పాల్ గ్రామానికి చెందిన నేతమ్ చెప్పారు.  అదే సమయంలో అటువంటి క్లిష్ట సమయంలో పిల్లలను భయపడకుండా కాపాడుకుంటున్నామని.. ఈ సవాలు దశ నుండి కోలుకోవడానికి ఒకరికొకరు సహాయం చేసినందుకు ఆమె పిల్లలను ప్రశంసించింది. ఆశ్రయం శిబిరంలో ఉన్న స్టడీ మెటీరియల్‌తో ఉన్నత తరగతుల్లో చదువుతున్న పిల్లలు చిన్న పిల్లలకు బోధిస్తున్నారని ఆమె తెలిపారు.

ఇక.. ఆశ్రయం శిబిరంలో పద్యాలు నేర్చుకోవడం, బ్యాడ్మింటన్ ఆడడం వంటి కార్యకలాపాలు పిల్లలు మానసిక క్షోభను అధిగమించడానికి సహాయపడుతున్నాయని నేతమ్ చెప్పారు. “అయితే ఎంతకాలం ఇట్లా సాగుతుంది? మా స్వస్థలాలకు తిరిగి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలి” అన్నారాయన. గత నెలలో ఘర్షణ జరిగినప్పటి నుండి సుమారు 10 మంది పిల్లలు పాఠశాలకు హాజరుకావడం లేదని కుదర్‌గావ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అజయ్ కుమేటి అన్నారు.  ఈ పిల్లలు కుటుంబ సమేతంగా నారాయణపూర్ నగరానికి మారారని తెలిపారు.

బాధిత కుటుంబాలు స్వగ్రామాలకు తిరిగి వెళ్లేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని నారాయణపూర్‌ కలెక్టర్‌ అజీత్‌ వసంత్‌ చెప్పారు.. అదే సమయంలో ఆశ్రమ శిబిరంలో ఉన్న పిల్లల చదువుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ”స్థానిక పాఠశాల ఉపాధ్యాయులను శిబిరానికి పంపాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించాను. 10, 12 తరగతుల్లో చదువుతున్న.. బోర్డు పరీక్షలకు హాజరుకావాల్సిన విద్యార్థుల చదువుల సమస్యను పరిష్కరించడం మా తొలి ప్రాధాన్యం” అని కలెక్టర్​ వసంత్ చెప్పారు. అదే సమయంలో అధికారులు రెండు వర్గాల సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. రాబోయే మూడు-నాలుగు రోజుల్లో ఈ కుటుంబాలను వారి స్వగ్రామాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు కలెక్టర్​ చెప్పారు.

“జిల్లాలోని 68 గ్రామ పంచాయతీలలోని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, గైతా (గిరిజన ప్రాంతాల్లోని గ్రామ పూజారి)తో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందరూ సామరస్యంగా జీవించాలని పరిస్థితిని చర్చించాము. సమావేశం అనంతరం షెల్టర్ క్యాంపులో నివసిస్తున్న గ్రామస్థులను వారి ఇళ్లకు తరలిస్తాం”అని కలెక్టర్​ చెప్పారు. కాగా, రెండు నెలలుగా జిల్లాలోని బేనూరు ప్రాంతంలో మత మార్పిడులు జరుగుతున్నాయనే అంశంపై పలు గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. జనవరి 2న, గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతంలో మత మార్పిడికి వ్యతిరేకంగా గిరిజనుల బృందం చేపట్టిన నిరసనలో నారాయణపూర్ నగరంలో చర్చి ధ్వంసం చేశారు. ఒక IPS అధికారితో సహా ఆరుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement