Thursday, April 25, 2024

ముంబై పై చెన్నై విజయం..

ఐపీఎల్-14 సీజన్‌ 2 లో చెన్నై సూపర్‌ కింగ్స్ శుభారంభం చేసింది. ముంబయి ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాట్స్‌మాన్ సౌరభ్ తివారీ చివరి వరకు పోరాడినా.. విజయం మాత్రం లభించలేదు. 58 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సౌరభ్ తివారీ, కిరాన్ పొలార్డ్ కలసి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే పొలార్డ్, కృనాల్ పాండ్యా స్వల్ప వ్యవధిలో పెవీలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన తివారీ ధాటిగా ఆడాడు. అయితే మిల్నే అవుటైన తర్వాత తివారీకి బ్యాటింగ్ ఛాన్స్ రాకపోవడం.. మరో ఎండ్‌లో చాహర్ తొలి బంతికే డకౌట్ అవడంతో ముంబై ఖాయమైంది. బ్రావో 3 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు తీయగా.. హేజిల్‌వుడ్,శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ తీశాడు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీసేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. డుప్లెసిస్, మొయిన్ అలీ డకౌటయ్యారు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన చెన్నైని రుతురాజ్ గైక్వాడ్‌ 88 పరుగులు చేసి ఆదుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. చెన్నై బ్యాట్స్‌మెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఇవాళ ఆర్సీబీ, కోల్‌కతా తలపడనున్నాయి.

ఇది కూడా చదవండి: ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పకోనున్న విరాట్ కోహ్లీ

Advertisement

తాజా వార్తలు

Advertisement