Friday, March 15, 2024

పంజాబ్ ఎన్నికల తేదీల్లో మార్పు.. అన్ని పార్టీల అభ్యర్థలతోనే ఈసీ నిర్ణ‌యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ సహా పలు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. ముందుగా అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 14న జరగాల్సిన పోలింగ్, ఫిబ్రవరి 20కు వాయిదా పడింది. ఒకే విడతలో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి మారిన తేదీలను కేంద్రం ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో పోలింగ్ తేదీని కనీసం వారం రోజుల పాటు వాయిదా వేయాలంటూ సీఎం ఛన్నీతో పాటు భారతీయ జనతా పార్టీ, మాజీ సీఎం – పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్ ధిండాకు చెందిన శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్), హోషియార్‌పూర్‌కు చెందిన బీజేపీ ఎంపి, కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ సహా పలువురు ఇతర రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు.

ఫిబ్రవరి 16న సంత్ శ్రీ గురు రవిదాస్ జయంతి సందర్భంగా వారం రోజుల ముందు నుంచి ఉత్సవాలు జరుగుతాయని, వాటిలో పాల్గొనేందుకు పంజాబ్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బెనారస్ (వారణాశి) నగరానికి లక్షల సంఖ్యలో భక్తులు వెళ్తారని పంజాబ్ నేతలు తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీ వరకు లక్షల సంఖ్యలో బెనారస్ సందర్శిస్తారని, పోలింగ్ జరిగే రోజు కనీసం 20 నుంచి 30 లక్షల మంది ఓటు హక్కుకు దూరమవుతారని పేర్కొన్నారు. బెనారస్ వెళ్లేవారిలో రాష్ట్రంలోనే అత్యధిక శాతం జనాభా ఉన్న దళితులే ఉంటారని, తద్వారా ఫిబ్రవరి 14న జరిగే పోలింగ్ రోజు చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. ఇందుకు సంబంధించి డేరా సచ్‌ఖండ్ బల్లాకు చెందిన సంత్ నిర్జన్ దాస్ జీ తనకు లేఖ రాశారని సీఎం ఛన్నీ తన లేఖలో పేర్కొన్నారు.

మొత్తమ్మీద సీఎం సహా వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం, సోమవారం ఉదయం గం. 10.30కు సమావేశమైంది. తేదీల మార్పుపై సమాలోచనలు జరిపి, ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను ఫిబ్రవరి 20 జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

  • నోటిఫికేషన్ జారీ తేదీ: 25 జనవరి 2022 (మంగళవారం)
  • నామినేషన్లకు చివరి తేదీ: 1 ఫిబ్రవరి 2022 (మంగళవారం)
  • నామినేషన్ల పరిశీలన తేదీ: 2 ఫిబ్రవరి 2022 (బుధవారం)
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 4 ఫిబ్రవరి 2022 (శుక్రవారం)
  • పోలింగ్ తేదీః 20 ఫిబ్రవరి 2022 (ఆదివారం).
  • ఓట్ల లెక్కింపుః 10 మార్చి 2022 (గురువారం)

ముందుగా ప్రకటించిన ప్రకారం…

జనవరి 21న నోటిఫికేషన్ జారీ

- Advertisement -

జనవరి 28 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ

జనవరి 29న నామినేషన్ పత్రాల పరిశీలన

జనవరి 31, నామినేషన్ల ఉపసంహరణ తేదీ

పోలింగ్ః ఫిబ్రవరి 14

Advertisement

తాజా వార్తలు

Advertisement