Friday, April 19, 2024

తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించండి: ఏపీకి కేంద్రం నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. పరిమితికి మించి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాలని నోటీసులు పంపింది. ప్రస్తుతం ఏపీ అప్పుల కుప్పగా మారింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం కూడా అప్పులు వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. పరిమితికి మించి అప్పులు చేయడం, ఆస్తుల తాకట్టుపెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. ఈ క్రమంలో పరిమితికి మించి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాలని నోటీసులు పంపించింది.

2019 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 2 లక్షల కోట్ల వరకు అప్పులు తీసుకువచ్చారు. ఇవి కాకుండా రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రూ. 25వేల కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకుల కన్సార్టియంతో మాట్లాడి.. రూ. 21.500 కోట్లు రుణంగా తెచ్చారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని సవరించినప్పటికీ కూడా ఏపీకి అప్పులు సరిపోవడం లేదు. సాధారణంగా జీఎస్డీపీలో 3 శాతం రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏపీలో జీఎస్డీపీ ప్రకారం రూ. 30,305 కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది.  కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, ఆదాయం తగ్గిపోవడంతో అన్ని రాష్ట్రాలకు 2 శాతం అదనంగా అప్పు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.

ఏపీ ప్రభుత్వం కేంద్రం విధించిన షరతులను అమలు చేసి పెంచిన శాతం మేరకు అప్పులు తీసుకువచ్చింది. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం పెంచిన శాతంతో కలిపి రూ. 49,497 కోట్ల రుణం తీసుకోవల్సి ఉండగా రూ. 54 వేల కోట్ల రుణం తీసుకువచ్చిందని కేంద్రం ప్రకటించింది. ఆర్థిక లోటు కూడా రోజు రోజుకూ పెరిగిపోతుందని, పరిమితికి మించి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాలని పేర్కొంటూ కేంద్రం ఏపీకి నోటీసులు పంపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement