Wednesday, April 24, 2024

మూలిగే నక్కపై పడ్డ తాటిపండులా ఏపీ ఆర్థిక పరిస్థితి

ఏపీ ప్రభుత్వం ఈ ఏడాదిలో పరిమితికి మించి రూ.4 వేల కోట్లకుపైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం నాడు పార్లమెంట్‌లో ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంత్సరానికిగాను రూ.54,369.18 కోట్లు ఆర్థిక లోటుగా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్‌లో స్పష్టం చేసిందని పేర్కొంది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

అసలే కరోనా కష్టాలు, ఆపై పెరిగిపోతున్న అప్పుల బాధలు… రూపాయి అప్పు పుట్టడం కష్టంగా ఉన్న ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సొంత అవసరాలకు వాడుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం భారీ ఝలక్ ఇచ్చింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చే నిధులు మళ్లించకుండా భారీ బ్రేక్ వేసేసింది. అంతే కాదు వీటికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటాను సైతం సకాలంలో చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో పీడీ ఖాతాలకు నిధులు మళ్లిస్తూ కాలం వెళ్లదీస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇక రాబోయే రోజులు మరింత కష్టమేనని తెలుస్తోంది.

మన దేశంలో ప్రతి రాష్ట్రం ప్రజలకు లబ్ది చేకూర్చే సంక్షేమ పథకాలను రూపొందించుకుని అమలు చేస్తుంటుంది. అదే సమయంలో కేంద్రం కూడా వీటికి అదనంగా కొన్ని ప్రత్యేక పథకాలను సమయానికి అనుకూలంగా రూపొందించి అమలు చేస్తుంది. అయితే వీటిలో కొన్ని నేరుగా పూర్తిస్ధాయిలో నిధులు ఇచ్చేవి అయితే, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కలుపుకుని అమలు చేసేవి ఉంటాయి. అంటే రాష్ట్రం కూడా తమ వాటా ఇస్తేనే ఆ పథకం సదరు రాష్ట్రంలో అమలవుతుంది. లేకపోతే అంతే సంగతులు. మరోవైపు కేంద్రం నేరుగా నిధులిచ్చే పథకాలు కూడా రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. దీనికి కారణం వాటికి కేంద్రం ఇచ్చిన నిధుల్ని రాష్ట్రాలు తమ సొంత పథకాలకు మళ్లించేసుకోవడమే.

ఇలా కేంద్ర ప్రభుత్వం తాము అమలు చేయాలనుకుంటున్న పథకాలకు పంపుతున్న నిధులు పక్కదారి పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఏపీలోనే గత టీడీపీ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా కేంద్ర నిధుల మళ్లింపును కొనసాగిస్తోంది. దీంతో కేంద్ర సంక్షేమ పథకాలు రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. అదే సమయంలో ఆ నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ పథకాలు అమలు చేసుకుంటూ ప్రజల వద్ద మైలేజ్ తెచ్చుకుంటున్నాయి. దీంతో ఇకపై ఆ మళ్లింపులకు బ్రేక్ వేయాలని నిర్ణయించిన కేంద్రం పక్కా చర్యలు ప్రకటించింది.

కేంద్రం తాజా మార్గదర్శకాల ప్రకారం కేంద్రం తమ పథకాలకు విడుదల చేసే నిధులు ఆర్‌బీఐలోని రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలకు చేరతాయి. ఆ తర్వాత వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ నోడల్ ఏజెన్సీలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అలాగే కేంద్రం తమ నిధులు విడుదల చేసిన 40 రోజుల్లోపు రాష్ట్రాలు కూడా తమ వాటా నిధులు విడుదల చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు నోడల్ ఏజెన్సీల ఏర్పాటుతో పాటు వాటి కింద అమలు చేసే ఏజెన్సీలను ఏర్పాటు చేయాలి. వాటి ద్వారా లబ్ది దారుల ఖాతాలకు చేరాల్సిందే. వీటిలో ఎక్కడ మళ్లింపు జరిగినా కేంద్రం చర్యలు తీసుకుంటుంది.

- Advertisement -

మూలిగే నక్కపై తాటిపండు
కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలు ఏపీ ప్రభుత్వానికి శరాఘాతం కానున్నాయి. సొంత రాబడి మార్గాలు వెతక్కుండా కేంద్రం ఇచ్చే నిధుల్ని ఎడాపెడా సొంత ఖాతాలకు బదిలీ చేసి తమ పథకాలు అమలు చేసుకుంటున్న వైసీపీ సర్కార్ తాజా మార్గదర్శకాలతో ఇరుకునపడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిధుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్ధితుల్లో కేంద్రం ప్రకటించిన తాజా మార్గదర్శకాలతో వైసీపీ సర్కార్ కు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చని అంచనా.

జగన్ ససేమిరా.. తప్పదంటున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వ పథకాలకు విడుదల చేస్తున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేయకుండా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను మూలన పడేసిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు కేంద్రం తాజా మార్గదర్శకాలను అమలు చేస్తే మరింత దివాళా తీయడం ఖాయం. దీంతో ఇప్పటికే 20 రాష్ట్రాలు అంగీకరించిన ఈ మార్గదర్శకాలను తాము మాత్రం అమలు చేయలేమని చెబుతోంది. కేంద్రం కొత్త విధానం అమలుతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోందని చెబుతోంది. అయినా కేంద్రం మాత్రం ఈ కొత్త విధానం అమలు కోసం 8 అంశాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement