Monday, March 20, 2023

అప్ప‌ర్ భ‌ద్ర‌పై కేంద్రం అమిత ప్రేమ‌..

అమరావతి, ఆంధ్రప్రభ : నీళ్ళు రాజకీయ రంగు పులుముకుంటు-న్నాయి..ఎన్నికల వేళ పార్టీలు, ప్రభుత్వాలు నీటిని వాటంగా తమ వైపు తిప్పుకుంటు-న్నాయి. 2023-24 వార్షిక బడ్జెట్‌ కృష్ణాకు దిగువున ఉన్న తెలుగు రాష్ట్రాల సాగునీటి ప్రయోజనాలను నిలువునా నీరుగా ర్చింది. కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్‌ భద్ర ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయని రెండు రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ మొరను ఆలకించకపోగా ఆ ప్రాజెక్టుకు రూ 5,300 కోట్ల భారీ బడ్జెట్‌ ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో మేలో ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటకుకు ఇది కేంద్ర ప్రభుత్వం అందించిన నజరానాగా నిపుణులువ్యాఖ్యానిస్తున్నారు. రూ 21,473 కోట్ల అంచనా వ్యయంతో కర్ణాటక ప్రభుత్వం పనులు ప్రారంభించిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కృష్ణా -టైబ్యునల్‌-1 (బచావత్‌ -టైబ్యునల్‌) ఒక్క చుక్క నీటిని కూడా కేటాయించలేదు. కృష్ణా -టైబ్యునల్‌ -2 (బ్రజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌) 9 టీ-ఎంసీలు కేటాయించిన ఇతర రాష్ట్రా ల అభ్యంతరాలతో ఆ నిర్ణయం నోటిపై కాలేదు.

- Advertisement -
   


అయినాసరే, అప్పర్‌ భద్రకు కేంద్ర ప్రభుత్వం ఇటీ-వలనే జాతీయ హోదా కల్పించింది. హైడ్రాలాజికల్‌ అనుమతులన్నీ మంజూరు చేసింది. ఇపుడు ఏకంగా రూ 5,300 కోట్లను కేటాయించింది. తొలి దశలో తుంగ నుంచి 17.40 టీ-ఎంసీలను ఎత్తిపోసి భద్ర జలాశయానికి తరలించటం.. ఆతరువాత భద్ర నుంచి 29.90 టీ-ఎంసీలన మళ్లించేలా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కర్ణాటకలోని 4 జిల్లాల్లో 6,48,328 ఎకరాల ఆయకట్టు-కు నీరందతుందని కర్ణాటక ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్పర్‌ భద్ర ప్రాజెక్టు పూర్తయితే తుంగభద్రలో నీటి ప్రవాహం తగ్గిపోయి శ్రీశైలంలో వరదనీరు అడుగంటే ప్రమాదం పొంచి ఉందని తెలుగు రాష్ట్రాల్లోని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత ఏడాది కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ- సమావేశంలో అప్పర్‌ భద్రకు జాతీయ హోదా కల్పించటంపైనా ఏపీ, తెలంతాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దిగువ రాష్ట్రాల అభ్యంతరాలకు సమాధానం చెప్పకుండా, అనుమానాలను నివృత్తి చేయకుండా అప్పర్‌ భద్ర ప్రాజెక్టును సమర్దిస్తూ సీడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రైజల్‌(సౌత్‌) విభాగం డైరెక్టర్‌ ఎన్‌.ముఖర్జీ కేంద్ర జలశక్తికి ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోవద్దని కూడా అధికారులు డిమాండ్‌ చేశారు. ఆ తరువాత కూడా అప్పర్‌ భ్రదపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ ప్రాజెక్టుకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది.

అనుమతుల్లేవు..నీళ్ళు లేవు..
అప్పర్‌ భద్ర ప్రాజెక్టు డిజైన్‌ తయారీలో భాగంగా 2002లో నియమించిన కమిటీ- కృష్ణా ఉపనది తుంగభద్రలో 6 టీ-ఎంసీల మిగులు జలాలు ఉన్నాయని నివేదిక ఇచ్చింది..బచావత్‌, ఆ తరువాత బ్రిజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌ ఆ నీటిని కర్ణాటకు కేటాయించలేదు. అప్పర్‌ భద్రకు 36 టీ-ఎంసీలు కేటాయించాలని కర్ణాటక కోరినా బచావత్‌ ట్రిబ్యునల్‌ ఒక్క టీ-ఎంసీని కూడా కేటాయించలేదు. విజయనగర చానళ్లు, తుంగ భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల తాము 11.5 టీ-ఎంసీల నీటిని వినియోగించులేకపోతున్నామనీ, ఆ నీటిని అప్పర్‌ భద్రకు కేటాయించాలన్న కర్ణాటక వాదనను బ్రిజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌ తోసిపుచ్చింది. అయినాసరే, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) బచావత్‌ -టైబ్యునల్‌ ను ఉటంకిస్తూ అప్పర్‌ భద్రకు సాంకేతిక, పెట్టు-బడి అనుమతులివ్వటం విడ్డూరంగా ఉందని గతంలోనే ఏపీ జలవనరుల అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కే-8, కే-9 సబ్‌ బేసిన్లలో తమ రాష్ట్రంలోని చిన్న నీటి వనరుల కేటగిరిలో వినియోగించుకోని నీటిని అప్పర్‌ భద్రకు తరలిస్తామని చెప్పటం ద్వారా కర్ణాటక కుంటిసాకులు చెబుతోంది. చిన్న నీటివనరుల విభాగంలో కే-8, కే-9 సబ్‌ బేసిన్లలో నీటి వినియోగం తగ్గిందని చెప్పేందుకు ఇంతవరకు శాస్త్రీయమైన ఆధారాలు లేవు..అధ్యయనం కూడా చేయలేదు. నీటి వినియోగ అంచనాల ప్రకారం కర్ణాటకలోని చిన్ననీటి వనరులకు కేటాయింపులకు మించి సాగునీరందుతోందని ఏపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో మిగులు జలాలు ఎక్కడున్నాయో చెప్పకుండా అప్పర్‌ భద్ర నిర్మాణానికి అనుమతులెలా ఇచ్చారో..ఏ ప్రాతిపదికన హైడ్రాలజికల్‌ క్లియరెన్సులు ఇచ్చారో చెప్పాలని ఏపీ ప్రశ్నిస్తోంది. బచావత్‌ -టైబ్యునల్‌ కేటాయింపుల స్థాయిలో తుంగభద్ర నుంచి నీరెప్పుడూ వినియోగంలోకి రాలేదు. అధికారిక లెక్కల ప్రకారం తుంగభద్ర డ్యాంకు ట్రిబ్యునల్‌ 230 టీ-ఎంసీలు కేటాయించినా గడిచిన 40 ఏళ్ళుగా సగటు-న వినియోగంలోకి వస్తున్న నీరు 186 టీ-ఎంసీలు మాత్రమే. కర్ణాటక మాత్రం 29.90 టీ-ఎంసీల సామర్దంతో నిర్మించే అప్పర్‌ భద్రకు తుంగభద్ర నుంచి 21.50 టీ-ఎంసీలను తరలిస్తామని చెప్పటం విడ్డూరంగా ఉంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ఒక్క టీ-ఎంసీనీ కూడా కేటాయించకపోతే 21.5 టీ-ఎంసీలను ఎలా తరలిస్తారని ఏపీ ప్రశ్నిస్తోంది. మిగులు జలాలకు అవకాశం లేని కే-8, కే-9 సబ్‌ బేసిన్ల పేరు చెప్పి కర్ణాటక తప్పించుకుంటు-ంటే..సీడబ్ల్యూసీ కూడా ఆ రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు పెల్లుబికుతున్నాయి.

తుంగభద్రపై తీవ్ర ప్రభావం
కృష్ణా ప్రవాహంలో వరద జలాలను దారి మళ్ళించి 29.90 టీ-ఎంసీలను నిల్వ చేసుకునేలా అప్పర్‌ భద్ర ప్రాజెక్టును కర్ణాటక నిర్మిస్తోంది. 6.25 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. దీనివల్ల కృష్ణాకు ఉపనదిగా ఉన్న తుంగభద్రకు వచ్చే వరద నీటి ప్రవాహం భారీగా తగ్గనుంది. ఫలితంగా తుంగభద్ర కింద రాజోలుబండ డైవర్షన్‌ స్కీం ద్వారా సుమారు 90 వేల ఎకరాల ఆయకట్టు-కు సాగునీరు అందటం సంక్లిష్టం కానుంది.. రాష్ట్రంలోని హంద్రీనీవా, కేసీ కెనాల్‌ ఆయకట్టు-కూ ఇబ్బందులు తప్పవు..కృష్ణా బేసిన్‌ లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలంతో పాటు- నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వల్లో సాధారణ నీటి ప్రవాహం తగ్గిపోయే ప్రమాదముందని జలవనరుల ఇంజనీర్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement