Thursday, April 25, 2024

Big Story: నిర్మాణరంగానికి కేంద్రం షాక్‌.. స్టీల్​పై ఎగుమతి సుంకాలు రద్దు, మళ్లీ ధరలు పెరిగే చాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రోజురోజుకు పెరుగుతున్న వడ్డీరేట్లతో ఇళ్ల డిమాండ్‌ పడిపోతుందన్న ఆందోనలో ఉన్న నిర్మాణరంగానికి కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. గతంలో నిర్మాణరంగ అసోసియేషన్‌ క్రెడాయ్‌ విజ్ఞప్తి మేరకు విధించిన స్టీల్‌ ఎగుమతి సుంకాన్ని రద్దు చేస్తూ కేంద్ర వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో గత కొంత కాలంగా దిగివచ్చిన స్టీల్‌ ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశం ఉందని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ రంగానికి అత్యంత కీలకమైన స్టీల్‌ ధరలు ఆకాశన్నంటుతున్నాయని తాము చేసుకున్న విజ్ఞప్తిని మన్నించి స్టీల్‌పై ఎగుమతి సుంకాన్ని విధించిన కేంద్రం 6 నెలలు గడవక ముందే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల ఇక్కడి స్టీల్‌ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవడం పెరిగి స్థానికంగా సరఫరా సమస్యలు తలెత్తి మళ్లి ధరలు పెరగవచ్చనేది నిర్మాణ రంగ వర్గాలు వాదిస్తున్నాయి. పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలతో భవన నిర్మాణం కష్టతరమైందని, తమను వెంటనే ఆదుకోకపోతే నిర్మాణరంగంపై ఆధారపడ్డ లక్షలాది మంది ఉద్యోగాలు పోతాయని ఉద్యమిస్తే తీసుకున్న నిర్ణయాన్ని ఇలా అకస్మాత్తుగా కేంద్రం ఉపసంహరించుకుంటుందని తాము ఊహించలేదని తెలంగాణ, హైదరాబాద్‌ చాప్టర్‌ క్రెడాయ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో స్టీల్‌ ధరలు మళ్లి పెరిగి నిర్మాణ రంగంపై ప్రభావం పడితే దానికి కేంద్రమే బాధ్యత వహించాలని వారు తేల్చిచెబుతున్నారు.

ఇబ్బడిముబ్బడిగా పెరిగిన మార్ట్‌గేజ్‌ రేట్లు..
ఇటీవలి కాలంలో దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వరుసగా రెపో రేట్లు పెంచుతూ వస్తోంది. దీంతో మార్ట్‌గేజ్‌ హోంలోన్‌ రేట్లు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం ఇప్పటికే గృహ రుణాలు పొందిన వారు చెల్లించే వాయిదాలపై పడింది. ఈఎంఐలు ఓ మోస్తరుగా పెరిగాయి. ఇదే కాక కొత్తగా గృహ రుణాలు తీసుకునే వారికి ప్రస్తుత వడ్డీ రేట్లను చూస్తే భయం వేసే పరిస్థితి నెలకొంది. దీంతో వారు రుణాలు తీసుకుని ఇళ్లు కొనుగోలు చేసే నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసే పరిస్థితి నెలకొంది.

- Advertisement -

ఈ పరిణామాల ప్రభావం నిర్మాణరంగం డిమాండ్‌ తగ్గడానికి కారణమవుతోంది. హైదరాబాద్‌లో కొత్త రెసిడెన్షియల్‌ ప్రాజెక్టుల లాంచింగ్‌ పెరిగినప్పటికీ అమ్ముడవని ఇళ్ల ఇన్వెంటరీ పెరుగుతోందని ఇటీవలే ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓ పక్క డిమాండ్‌ పడిపోతున్న తరుణంలో తమకు ప్రధాన ముడి సరుకైన స్టీల్‌ ఖర్చును పెంచే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని క్రెడాయ్‌ వర్గాలు వాపోతున్నాయి. కాగా, ఎప్పటినుంచో నిర్మాణరంగం తరపున తాము చేస్తున్న డిమాండ్‌లను పెడచెవిన పెడుతూ వస్తున్న కేంద్రం వచ్చే బడ్జెట్‌లోనైనా తమ కోరికలు నెరవేర్చచాలని, స్టీల్‌పై మళ్లీ ఎగుమతి సుంకం విధించాలని క్రెడాయ్‌ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement