Friday, April 19, 2024

‘కుల’కలం – ఏ రాష్ట్రమేగినా ఇదే రాజకీయం!

దేశంలో మతాల తర్వాత కులాల ప్రస్తావనతో రాజకీయాలు సాగుతున్నాయి. అగ్రవర్ణాలు, బహుజనులు, దళితులు అంటూ వర్ణాలు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ రాజకీయాల్లో కులాలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఇక్కడ మొదటి నుంచి రెడ్లు, వెలమల ఆధిపత్యం ఉన్నప్పటికీ.. సామాజిక వర్గాలకు అతీతంగా ఇక్కడి రాజకీయాలు సాగుతాయి. కానీ తెలంగాణలోనూ మెల్లగా సామాజికవర్గాల కోణంలో రాజకీయాలు చేయడం మొదలైంది. ఏపీ స్థాయిలో కులాభిమానం ఇక్కడ లేకపోయినా.. రాజకీయ పార్టీలు మాత్రం సామాజిక వర్గాల కోణంలో ఆలోచిస్తున్నాయి.

రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా కులాల వైపు మళ్లాయి. తెలంగాణ జనాభాలో అత్యధికులు బీసీలే ఉన్నారు. బడుగు వర్గాలు ఎటు మొగ్గితే ఆపార్టీదే అధికారం. ఈ విషయం తెలుసు కాబట్టే రాజకీయ పార్టీలు బీసీలను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నాయి. జనాభాపరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీల వైపు తెలంగాణలోని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అయితే, ఎన్నికలను దృష్టి పెట్టుకుని పార్టీ రాజకీయ సమీకరణలకు దృష్టిలో పెట్టుకుని ఆయా వర్గాలను ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నాయి. ఆయా సామాజిక వర్గాలకు చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఓట్ల పొందాలని పార్టీలు భావిస్తున్నాయి.

ఏపీలో మాత్రమే కులాల కుమ్ములాటలు ఉన్నాయని, అక్కడ మాత్రమే రాజకీయలు కులాలతో నిండిపోయాయని గతంలోనే అనేకసార్లు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విరమర్శించారు. అయితే, ఇప్పుడు మాత్రం తెలంగాణలో కులాల కుంపట్లు రాజుకున్నాయి. కులం పేరుతో ఒకరి నొకరు ఓడించుకునేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏ రాష్ట్రంలో అయినా ఎక్కువగా ఏ సామాజిక వర్గం ఉంటే ఆ సామాజిక వర్గం ఆధిపత్యం చలాయిస్తుందని అనుకుంటారు. అయితే, తెలంగాణలో మాత్రం ఇది రివర్స్ అయింది. అతి తక్కువగా అంటే 0.5 శాతం జనాభా మాత్రమే ఉన్న వెలమ వర్గానికి చెందిన కేసీఆర్ రాష్ట్రంలోని మిగిలిన వర్గాలను పాలిస్తున్నారు. ఇక, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 92 శాతం ఉన్నా.. వారికి తగిన ప్రాధాన్యం మాత్రం ఇవ్వడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారు. ఫలితంగా బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. అయితే, ఈటల ప్లేస్ ఖాళీ అవ్వడంతో టీఆర్ఎస్ ఆ స్థానాన్ని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో భర్తీ చేయాలని ప్రణాళిక రచిస్తోంది. ఇందుకు కోసం ఇప్పటికే ఆయనతో చర్చ కూడా జరిపింది.

ఇక, దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓటు బ్యాంకు కీలకం. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద బీజేపీలో చేరడంతో బలాన్ని ఇచ్చింది. యూపీ సీఎం యోగి బ్రాహ్మణులను తన పాలనలో నిర్లక్ష్యం చేశారని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వాదనలతో బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జితిన్ ప్రసాదకు మంత్రిత్వ బాధ్యతలు అప్పజెబితే, బ్రాహ్మణుల ఓటు బ్యాంకు పదిలంగానే ఉంటుందని బీజేపీ భావిస్తోంది.  మొత్తం మీద ప్రభుత్వాలు మారుతున్నా వాటి వెన‌క కుల ర‌క్క‌సి మారుతుంది త‌ప్ప పూర్తిగా అంతం కావడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement