Thursday, April 25, 2024

దళిత దండోరాకు ఆ నేతలు వస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా రెండో సభకు సిద్ధమవుతోంది. ఇంద్రవెల్లిలో జరిగిన సభ విజయవంతం కావడంతో రెండో సభను సైతం అదే స్థాయిలో విజయం చేసే దిశగా కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దళిత, గిరిజన దండోరా కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే, ఈ సభకు పార్టీ కీలక నేతలు హజరు అవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ తల పెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు కీలక నేతలు గైర్హాజరయ్యారు. పార్టీలో కీలక వ్యవహరించిన నాయకులు ఇంద్రవెల్లి సభకు దూరంగా ఉండడంతో.. కాంగ్రెస్‌లో ఆదిపత్య పోరు ఇంకా తగ్గలేదనే టాక్ వినిపించింది. సదరు నాయకులు కావాలనే సభకు రాలేదా? లేకా ఆ నాయకులను కావాలనే పక్కన పెట్టారా? అన్నది హాట్ టాపిక్ అయ్యింది. నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడా కనిపించ లేదు. మాజీ పీసీసీ చీఫ్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, వీహెచ్, రాష్ట్ర పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ సైతం ఇంద్రవెల్లి సభకు గైర్హాజరు అయ్యారు. దీంతో తాజాగా ఇబ్రహీంపట్నంలో తలపెట్టిన సభకు వారు వస్తారా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కార్యక్రమాలలో అంత చురుగ్గా పాల్గొనటం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంద్రవెల్లి సభకు డుమ్మా కొట్టడం వెనుక పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గడమే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తమ్ బంధువైన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గించారనే వాదానలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో కోవర్టలకు స్థానం లేదంటూ ఇప్పటికే రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే నేతలను రేవంత్ దూరం పెడుతున్నారనే తెలుస్తోంది. అందుకే రాష్ట్ర పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలు సైతం ఉత్తమ్ కు చెప్పడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేతల భేటీకి సంబంధించిన కనీస సమాచారం కూడా ఆయనకు ఇవ్వడం లేదని చర్చ జరుగుతోంది. ఇంద్రవెల్లి సభకు సంబంధించి సమాచారం లేకపోవడం వల్లనే ఆయన రాలేకపోయారని ఉత్తమ్ వర్గం చెబుతోంది.

ఇంద్రవెల్లి సభకు సంబంధించి కనీసం ఆహ్వానం అందకపోవడంతో కోమటిరెడ్డి సోదరులు కూడా అసంతృప్తిగా ఉన్నారట. సభ ఏర్పాటుకు సంబంధించి వారిని ఎవరు సంప్రదించలేదని బాహాటంగానే అంటున్నారు. అయితే, కారణాలు ఏవి అయిన, పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జరిగిన సభకి ముఖ్య నేతలు రాకపోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు నిరాశకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సభకు అందరు నాయకులను స్వయంగా ఆహ్వానించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కోమరెడ్డి సహా తొలి సభకు హాజరు కానీ నాయకులను స్వయంగా కలిసి సభకు రావాల్సిందిగా ఆహ్వానించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరోవైపు ఇబ్రహీంపట్నం సభ నిర్వహణకు ముందు అనుకున్న స్థలాన్ని మార్చారు. పోలీసుల అనుమతి ఇవ్వకపోవడంతో స్థలాన్ని మారుస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు.  ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా ఉండేందుకు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ దండోరా సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. మొత్తం మీద ఈ సభకు ఎంత మంది సీనియర్లు వస్తారు? అన్నది చూడాలి.

- Advertisement -

ఇది కూడా చదవండి: తెలంగాణలో స్కూళ్లు రీ-ఓపెన్.. ప్రభుత్వం నిర్ణయమేంటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement