Thursday, March 28, 2024

బడ్జెట్‌ రూపకల్పన ఓ సవాల్‌, అన్ని రంగాలకు సముచిత స్థానం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న వేళ బడ్జెట్‌ కేటాయింపులు అందరికీ కీలకంగా మారాయి. ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో కీలకంగా మారింది. ద్రవ్యలోటును అదుపులో ఉంచుకుని.. ద్రవ్యోల్బణంపై దృష్టిసారిస్తూ.. అధిక వృద్ధిని సాధించేందుకు కేంద్రం తీవ్ర కసరత్తే చేస్తున్నది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ రూపకల్పన జరుగుతున్నది. బడ్జెట్‌ కేటాయింపులు అనేవి.. కేవలం కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కే ఛాలెజింగ్‌గా కాకుండా.. కార్యదర్శులు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. మూడో వేవ్‌ దేశ ఆర్థిక పునరుద్ధరణకు ప్రతికూలంగా ప్రభావితం చేసింది. రాబోయే బడ్జెట్‌లో వృద్ధి, వినియోగం, పెట్టుబడులను ఎత్తివేసే కీలక సవాల్‌ను పరిష్కరించాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖలోని వివిధ విభాగాలకు చెందిన కార్యదర్శులు ఎంతో శ్రమకోర్చి.. బడ్జెట్‌కు ఓ రూపాన్ని తీసుకొస్తారు. అందులో కీలకమైన ఆర్థిక శాఖ కార్యదర్శుల గురించి తెలుసుకుందాం..

టీవీ సోమనాథన్‌, ఆర్థిక కార్యదర్శి, వ్యయ శాఖ కార్యదర్శి

టీవీ సోమనాథన్‌.. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. తమిళనాడుకు చెందిన సోమనాథన్‌.. వరల్డ్‌ బ్యాంకులో పని చేసిన అనుభవం ఉంది. ఆ తరువాత.. 2015లో ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. సోమనాథన్‌.. ఆర్థిక కార్యదర్శిగా, ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని వృద్ధికి నిధులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూలధన వ్యయ బడ్జెట్‌ను ఖర్చు చేయడానికి మంత్రిత్వ శాఖలు, విభాగాలపై సోమనాథన్‌ ఒత్తిడి చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఈ జోరు కొనసాగించాలని భావిస్తున్నారు.

అజయ్‌ సేథ్‌, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి

అజయ్‌ సేథ్‌.. 1987 ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన అధికారి. కర్నాటకకు చెందిన ఈయన.. గతేడాది ఏప్రిల్‌లో కరోనా మహమ్మారి రెండో వేవ్‌లో దేశం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులయ్యారు. కర్నాటకలో బడ్జెట్‌, వనరులు, వాణిజ్య పన్నుల శాఖను చూసిన అజయ్‌ సేథ్‌.. మూడో వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త బడ్జెట్‌ రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇది ఈయనకు ఎంతో సవాల్‌తో కూడుకున్న పనే.. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌కు ఇబ్బంది కల్గకుండా వృద్ధిని పునరుజ్జీవింపజేయడానికి చేపట్టే చర్యల కోసం కీలక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

దేవశీష్‌ పాండే, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి

దేవశీష్‌ పాండా.. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్నో సంస్కరణలకు ఆయనే పునాది వేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మెరుగ్గా రాణిస్తున్నాయి. రాబోయే బడ్జెట్‌లో మరింత ఊపును అందించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. బ్యాడ్‌ బ్యాంక్‌, డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. జన్‌ధన్‌ 3.0పై దృష్టి కేంద్రీకరించారు. రాబోయే బడ్జెట్‌లో ఎన్నో ఉపశమన చర్యలు కల్పించేలా బడ్జెట్‌ రూపకల్పనలో తనదైన మార్క్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కీలక కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.

తరుణ్‌ బజాజ్‌, రెవెన్యూ శాఖ కార్యదర్శి

తరుణ్‌ బజాజ్‌.. 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ కేడర్‌ అధికారి. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా చేరడానికి ముందు ప్రధానమంత్రి కార్యాలయంలో విధులు నిర్వర్తించారు. దేశం పాక్షిక లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు మహమ్మారి మొదటి వేవ్‌ సమయంలో మంత్రిత్వ శాఖలో చేరారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ రిలీఫ్‌ ప్యాకేజీలో కీలక అధికారుల్లో ఒకరు. ఆ తరువాత రెవెన్యూ శాఖకు బదలీ చేయబడ్డారు. వాస్తవిక పన్నును నిర్ణయించే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అండర్‌ స్టేట్‌ అండ్‌ ఓవర్‌ అచీవ్‌తో ముందుకు వెళ్లారు. పన్నుల వసూళ్లలో లక్ష్యానికి దగ్గరలో ఉంది. రెట్రోస్పెక్టివ్‌ పన్ను సవరణను ఉపసంహరించుకోవడం ద్వారా.. విదేశీ పెట్టుబడిదారులకు అతని శాఖ బలమైన సందేశం పంపింది.

తుహిన్‌ కాంత్‌ పాండే, ఇన్వెస్ట్‌మెంట్‌, పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి

తుహిన్‌ కాంత్‌ పాండే.. 1987 ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన అధికారి. ఒడిశా వాస్తవ్యుడు. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషించారు. ప్రైవేటీకరణపై కీలకమైన వివరణ ఇచ్చారు. మరో 17 వ్యూహాత్మక ప్రైవేటీకరణలు వరుసలో ఉన్నాయి. అసెట్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ కూడా సిద్ధంగా ఉంది. రాబోయే ఏడాదిలో పూర్తి కార్యాచరణ కలిగి ఉన్నారు. ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ మెగా లిస్టింగ్‌, దాని భారీ ఖర్చు అవసరాలను తీర్చడానికి ప్రభుత్వమే కాకుండా.. మార్కెట్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దీపం పథకం కార్యదర్శిగా కూడా తుహిన్‌ కాంత్‌ పాండే విధులు నిర్వర్తించారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement