Thursday, March 28, 2024

ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌కే ఉంది.. మంత్రి కొప్పుల

ఓదెల, మార్చి 21 (ప్రభన్యూస్‌): దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఒక్క బీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే ఉందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుతున్నాయని, ఆ రెండు పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పని చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఏ ఇంటికి వెళ్లినా పథకం అందని ఇల్లు ఉండదన్నారు. రానున్న ఎన్నికల్లో పెద్దపల్లిలో మూడోసారి బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని, ఎమ్మెల్యే దాసరి కి హ్యాట్రిక్‌ విజయం కట్టబెట్టాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలోనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, సీఎం సహాయనిధి, కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్లు తదితర సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలన్నారు. ప్రజలు మెచ్చేలా పాలన అందించిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గ్రామాల్లో కార్యకర్తలు విభేదాలను పక్కనబెట్టి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల అబద్ధాలు, అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేలా ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీపీ రేణుకాదేవి, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌ రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కావటి రాజు, ఆకుల మహేందర్‌, గట్టు శ్రీనివాస్‌, పోతుగంటి రాజు, రెడ్డి శ్రీనివాస్‌, ఐరెడ్డి కిషన్‌రెడ్డి, కనికిరెడ్డి సతీష్‌, గుండేటి మధు, పత్తి సవిు్మరెడ్డి, మ్యాడగోని శ్రీకాంత్‌ గౌడ్‌, బోడకుంట చిన్న స్వామి, చింతం మొగిలి, తీర్థాల కుమార్‌లతోపాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement