Thursday, March 28, 2024

Breaking: రైతుల‌కు మేలు చేసేదాకా పోరాటం.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో టీఆర్ఎస్ ఎంపీల నిర‌స‌న‌…

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద‌ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళ‌న‌కు దిగారు. ‘‘రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలి’’ అనే ప్ల‌కార్డుల‌ను టీఆర్ఎస్ ఎంపీలు ప్ర‌ద‌ర్శించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్‌స‌భ‌ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేష్ నేత తదితరులు ప్ల కార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ ముందు చూపు వల్ల రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు వంటి పథకాలతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందటం వల్ల దిగుబడులు పెరిగాయని, ఆ మేరకు ఎఫ్‌సీఐ కొనుగోళ్లను పెంచాల్సి ఉందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాదు, రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను చేపట్టాలన్నారు. దేశానికి ఆదర్శవంతమైన రైతుకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలు అమలు అవుతున్నాయని, అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం విధి, విధానాలను రూపొందించి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతుల కోసం తమ ఆందోళన, ఉద్యమం కొనసాగుతుందని వారు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement