Thursday, November 14, 2024

బీజేపీ బంపర్ ఆఫర్… ఈటలకు కేంద్రమంత్రి పదవి?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమైనా? కొత్త పార్టీ పెట్టడం కంటే జాతీయ పార్టీలో చేరితేనే బెటర్ అని భావిస్తున్నారా? తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఈటల రాజేందర్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన రాజకీయ భవిష్యత్ ఎంటి? కొత్త పార్టీ పెడుతారా? ఇతర పార్టీల్లో చేరుతారా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, ఈటల బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ.. ఈటలకు రాజ్యసభ పదవి ఆఫస్ చేసినట్లు టాక్. అంతేకాదు కేంద్రంలో సహాయ మంత్రిగా బాధ్యతలు కూడా అప్పగిస్తారని ప్రచారం జగుతోంది. ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఈటల తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామాతో జరిగే హుజురాబాద్ ఉప ఎన్నికలో తన భార్య జమునను బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

భూ ఆక్రమణ వ్యవహారంలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల తన రాజకీయ భవిష్యత్తుపై కిషన్ రెడ్డితో కీలకంగా చర్చిస్తున్నట్టు సమాచారం. దీంతో త్వరలోనే ఈటెల బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ నేత భూపేందర్‌ యాదవ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చారని తెలుస్తోంది. నగర శివారులో బీజేపీ ముఖ్య నేతలతో వీరు రహస్య భేటీ అయినట్లు సమాచారం. మొయినాబాద్‌లోని వివేక్‌ వెంకటస్వామి ఫామ్‌ హౌస్‌ లో మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, వివేక్‌, డీకే అరుణ సహా మరో పలువురు రహస్యంగా సమావేశమయ్యారు. ఆదివారం ఈటలతో మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతల భేటీలో ప్రధానంగా ఈటలను పార్టీలో చేర్చుకోవడంపైనే చర్చ జరిగిందని సమాచారం.

ప్రస్తుతం హుజూరాబాద్ లో ఈటలను ఒంటరి చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఈటలకు మద్దతు ఇస్తున్న వారిని టార్గెట్ చేసిన టీఆర్ఎస్.. ఇప్పటికే వారిని ఈటల నుండి దూరం చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు పట్టున్న మండలాలు, గ్రామాల్లోని టీఆర్ఎస్ కార్యకర్తలను ఈటల వెంట వెళ్లకుండా కట్టడి చేస్తోంది. కమలాపూర్ సహా పలు గ్రామాల్లో ఈటలకు ఉన్న ప్రధాన అనుచరులను టీఆర్ఎస్ తమవైపుకు తిప్పుకుంది. ఈ వ్యవహారంలో ఆపార్టీ ట్రబుల్ షూటర్ హరీష్‌ రావు కీలక పాత్ర పోషించారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల ను దెబ్బ తీయడానికి మంత్రి గంగుల కమలాకర్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలితం ఇవ్వలేదు. దీంతో నియోజకవర్గంలో పట్టు సాధించడానికి మంత్రి హరీష్ రావును ప్రయోగించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కేసీఆర్ ఆదేశాలతో రంగంలో దిగిన హరీష్.. హుజురాబాద్ నియోజకవర్గ నేతలతో వరుస భేటీలు అయ్యారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. పార్టీ నాయకులంతా తాము సీఎం  కేసీఆర్ తోనే ఉంటామని స్పష్టం చేశారు. తనను ఒంటరి చేసేందుకు టీఆర్ఎస్ చేస్తున్న ప్లాన్ ను పనిగట్టిన ఈటల.. ఇంకా స్పీడ్ పెంచారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొత్త పార్టీ పెట్టడంపై తన అనుచరులతో గత కొద్ది రోజులుగా సమాలోచనలు జరిపారు. ప్రస్తుత పరిస్థితిలో బీజేపీలో చేరితే మంచిదనే అభిప్రాయాన్ని కొందరు నేతలు ఈటల వద్ద వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల భోగట. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ నేతలతో భేటీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈటల ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలతో ఆయన భేటీ అయ్యారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో రహస్య మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం పలువురు బీజేపీ నేతలను కూడా కలిశారు. అయితే, ఈట‌ల ఏ నిర్ణయం తీసుకుంటారు ? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement