Thursday, April 18, 2024

తిరుపతిని కాషాయ దళం లైట్ తీసుకుందా?

తెలుగు రాష్ట్రాల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ.. దుబ్బాకలో గెలవడం ద్వారా తెలంగాణలో తాము బలపడ్డామనే సంకేతాలు పంపింది. ఇక తిరుపతి లోక్ సభ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా ఏపీలోనూ వైఎస్సార్సీపీకి ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకునేందుకు తహతహలాడుతోంది. బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దియోధర్ ఇప్పటికే తిరుపతిలో మకాం వేశారు. అధికార వైఎస్సార్సీపీపై విమర్శల దాడిని మొదలుపెట్టారు. అయితే, ప్రచారపర్వంలో మిగత పార్టీలతో పోలిస్తే.. బీజేపీ కాస్త వెనుకే ఉందనే టాక్ వినిపిస్తోంది. నడ్డా, పవన్ కల్యాణ్, బండి సంజయ్ లాంటి వారు తప్ప.. మిగత స్టార్ క్యాంపెయినర్లు ఎవరు కనిపించ లేదు.

పోలింగ్ తేదీ దగ్గరవుతున్న కొద్ది తిరుపతి లోక్‌సభ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచార పర్వం వేడెక్కుతోంది. సవాళ్ళు, ప్రతి సవాళ్ళకు వేదికవుతోంది. బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చరిస్మాతో గెలవాలనుకుంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి కే.రత్నప్రభ ఉప ఎన్నికల్లో పోటీకి దింపింది. బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న రత్నప్రభ తరుపున ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో సానుభూతి అస్త్రం పని చేయలేదు.  ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. దుబ్బాక ఉప ఎన్నిక ఇచ్చిన కిక్‌తో తిరుపతి లోక్ సభ స్థానాన్ని సైతం దక్కించుకోవడం కోసం బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. దుబ్బాకలో అధికార పార్టీని మట్టికరిపించిన విధంగానే.. తిరుపతిలోనూ వైఎస్సార్సీపీని ఓడించేందుకు కమలనాథులు కసరత్తులు చేస్తున్నారు. తిరుపతి హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో… హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం, రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు తదితర అంశాలను బీజేపీ తెరపైకి తీసుకొస్తోంది. అయితే, ప్రచారంలో రాష్ట్ర నాయకులు తప్ప.. జాతీయ నాయకులు కనిపించడం లేదు. గతంలో తెలంగాణలో జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీ ఆగ్ర నాయకులు వచ్చి మరీ ప్రచారం చేశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాష్ జవదేకర్ తోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితరులు ప్రచారం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే కొన్ని గంటల ముందు ప్రధాని మోదీ సైతం హైదరాబాద్ కు వచ్చారు. ఎన్నికల వేళ.. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఎంత వరకు వచ్చాయో  తెలుసుకునేందుకు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ను మోదీ సందర్శించారు. దీని ప్రభావం ఎన్నికల్లో పడిందని, జీహెచ్ఎంసీ ఫలితాల ద్వారా తెలుస్తోంది.

గ్రేటర్ ఎన్నికల కోసం ప్రచారం చేసిన కాషాయ దళం.. ఇప్పుడు తిరుపతిలో ఎందుకు ఆస్థాయిలో ప్రచారం చేయడం లేదనే చర్చ జరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలే తిరుపతిలోనూ పునరావృతం అవుతాయని చెబుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. జాతీయ నేతలను ప్రచారానికి రప్పించడంలో విఫలం అయ్యారనే వాదాన నడుస్తోంది. తిరుపతిలో ప్రధాని మోదీ, అమిత్ షా కూడా ప్రచారం నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా మినహా అగ్ర నాయకులు ఎవరు తిరుపతిని పట్టించుకోలేదు. దీంతో బీజేపీ అగ్రనాయకత్వం తిరుపతి ఉప ఎన్నికను లైట్ తీసుకుందనే ప్రచారం సాగుతోంది.

మరోవైపు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యవహార శైలిపై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం నాయుడుపేట సభలో పార్టీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం చేసిన ఆయన.. ఉప ఎన్నికలో విజయానికి రాష్ట్ర నేతలు అనుసరిస్తున్న వ్యూహాలపై పెదవి విరిచినట్లు సమాచారం. బూత్‌ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని జాతీయ నాయకత్వం చెబుతున్నా.. రాష్ట్ర నాయకులు పట్టించుకోలేదు. కార్యకర్తలతోనూ సరిగా సమన్వయం చేసుకోకుండా అస్తవ్యస్తంగా వదిలేయడంతో నడ్డా సీరియస్ అయ్యారనే తెలుస్తోంది. పైగా నాయకుల మధ్య సమన్వయ లోపం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని నడ్డా ఆక్షేపించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుపతిలో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. గత రెండు పర్యాయాలు ఇక్కడ వైఎస్సార్సీపీ గెలుపొందింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థిపై బీజేపీ-జనసేన విజయం సాధిస్తే.. ఏపీ రాజకీయాల్లో అది పెనుమార్పుగానే భావించాలి. తిరుపతిలో బీజేపీ గెలిచి చరిత్ర సృష్టిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement