Saturday, September 23, 2023

Breaking: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తాం: బండి సంజయ్

తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చాక వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులైన పేదలందరికి ఇండ్లను నిర్మించి ఇస్తామని అన్నారు. బంగారు తెలంగాణ అన్న సీఎం కేసీఆర్.. సామాన్యులకు బతుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ విజయవంతం కావడంతో జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు. తన పాదయాత్ర ముగింపు సభకు అమిత్ షా రావడంతో ప్రతి కార్యకర్తలో జోష్ వచ్చిందని అన్నారు. అమిత్ షా ప్రసంగం కొన్ని రాజకీయ పార్టీలకు ఒక చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబంలో వెలుగులు నింపుతామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఉచిత విద్య, ఉచిత వైద్యానికి కట్టుబడి ఉన్నామని, బీజేపీ అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలు ఎక్కువయ్యాయని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే నిరుపేదలకు పక్కా ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement