Monday, January 30, 2023

Big Story: కాగితాల్లో చట్టాలు.. కార్మికులుగానే బాలలు

అక్షరాలు దిద్దాల్సిన చిన్నారుల చేతులు.. పలుగు, పార పడుతున్నాయి.. తల్లిదండ్రుల ఒడిలో సుకుమారంగా పెరగాల్సిన బాల్యం.. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా చెమలు కక్కుతున్నాయి. ఏ హోటల్‌లో చూసినా..ఏ భవన నిర్మాణ పనులను వీక్షించినా.. ప్రజాప్రతినిధులు, అధికారుల గృహాలు పరిశీలించినా.. బుగ్గి పాలవుతున్న బాల్యమే కనిపిస్తుంది. ఏ ప్రజాప్రతినిధి నోట విన్నా.. వినిపించే మాటలు.. బాలల శ్రేయస్సే తమ లక్ష్యమని.. ఏ అధికారి మాట విన్నా.. బాల్యం బండల పాలు కాకుండా చూడటమే తమ కర్తవ్యమని.. చట్ట సభల్లో బాలల భవిష్యత్తు కోసం.. గలమెత్తిన నేతల గొంతులు చట్టాలెన్నో చేశాయి. బంగారు బాల్యాన్ని కాగితాల్లో భద్రపరిచి ఆచరణలో మాత్రం విస్మరించాయి. చేసిన చట్టాలు నేతలకు వేదికల నెక్కినప్పుడే గుర్తుకొస్తున్నాయి. బాలల దినోత్సవాలు వచ్చినప్పుడే అధికారులకు చట్టాలు. అమలు చేయాలని గుర్తుకురావడం వల్ల బంగారు బాల్యం బుగ్గిపాలవుతూనే ఉంది. చిన్నారుల భవిష్యత్తు పరిరక్షించాలని ప్రతి ఏడాది ఏప్రిల్‌ 30న జాతీయ బాల కార్మిక దినోత్సవాన్ని నిర్వహస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చిన్నారుల పరిస్థితిపై ప్రత్యేక కథనం.

పెద్దపల్లి జిల్లాలోని ఇటుక బట్టీల్లో చిన్నారులు పని చేస్తున్నా అధికారులకు కానరాకపోవడం శోచనీయం. దీంతోపాటు మట్టి పనులు, రోడ్డు నిర్మాణ పనులు, భవన నిర్మాణ పనుల్లో బాలలు కనిపిస్తున్నారు. ఏ హోటల్‌లో చూసినా.. ఏ కిరాణ షాపులో చూసినా 14 ఏళ్ల లోపు చిన్నారులు పని చేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా పొట్ట కూటి కోసం చిన్నారులు గారడి విద్య చేస్తున్నారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం బ్రిడ్జి పాఠశాలలు నిర్వహిస్తున్నా.. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో బడి బాట కార్యక్రమం నిర్వహిస్తున్నా.. ఫలితాలను ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చిన్నారులపై శ్రద్ద వహించి వారి బంగారు భవిష్యత్తు బుగ్గి పాలు కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement