Friday, April 19, 2024

Big Story: యాసంగికి పెట్టుబడి సాయం.. విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి..

ప్ర‌భ‌న్యూస్ : యాసంగి రైతుబంధు విడుదల దిశగా సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఖజానాలో నిధులపై ఆయన ఆర్థిక శాఖ నుంచి వివరాలు తెప్పించుకున్నారు. యాసంగి సీజన్‌లో రైతాంగానికి పెట్టుబడి సాయంగా ఈ నిధులు ఉపకరించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ఉదాసీనత కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని రైతుబంధు నిధులతో సాగు దిశగా సమాయత్తం చేయాలన్నది ప్రభుత్వ సంకల్పంగా ఉంది. ఈ సీజన్‌లో కోటిన్నర లక్షల ఎకరాలకు రూ.7500 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో ఈ నిధుల సర్దుబాటు, సమీకరణపై సీఎం కేసీఆర్‌ ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈనెలాఖరు లేదంటే వచ్చే నెల ఉద్యోగుల వేతనాలు చెల్లించిన వెంటనే రైతుబంధు నిధులను విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత జూన్‌లో వానాకాలం పంట సాగుకు 60.84లక్షల మంది రైతాంగానికి రూ.7360 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

అయితే యాసంగి సీజన్‌లో విస్తీర్ణం పెరగడంతో సాయమందించాల్సిన నిధులు కూడా పెరగనున్నాయి. దీంతో నగదును సర్కార్‌ సిద్ధం చేస్తోంది. మొదటిరోజు ఎకరం వరకు, రెండో రోజు రెండెకరాల రైతులకు, మూడోరోజు మూడెకరాల రైతులకు ఇలా వరుసగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉన్న నిధులు, వేతనాలు, పింఛన్లు, ఇతర ప్రజాసంక్షేమ పథకాలకు చెల్లింపుల వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పథకానికి నిధుల సేకరణ దిశగా దృష్టి సారించింది. ఏదైమైనా అనుకున్న గడువులోగా రైతులకు అండగా నిల్చేందుకు రైతుబంధు సాయం అందించి తీరాల్సిందేనని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

రాష్ట్రంలోని 1,40,98,486 ఎకరాల్లో సాగుతో పచ్చగా కళకళలాడేందుకు సర్కార్‌ సాయం ఊతంగా నిల్వనుంది. తొలివిడతగా రైతుబంధు సాయం కింద రూ.5608.9 కోట్ల నిధులను ప్రభుత్వం కోటి 40లక్షల 98వేల 486 ఎకరాలకు అందించింది. ఏకకాలంలో పట్టదార్‌ పాస్‌ పుస్తకాలతోపాటు రైతుబంధు సాయం చెక్కులను గ్రామాలకు వెళ్లి నేరుగా రైతుల చేతికి అందించింది.

మొత్తం రైతుబంధు సాయంతో లబ్ది పొందుతున్న రైతాంగంలో అన్ని రకాల రైతులూ ఉన్నారు. చిన్న, సన్నకారు, మధ్య, ఉన్నత భూ క్షేత్రాలు కల్గిన రైతులు ఉన్నారు. అయితే 40,92 లక్షల మంది సన్నకారు రైతులు రెండున్నర ఎకరాలలోపు మాత్రమే భూమి కల్గిన వారున్నారు. ఇక 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి కల్గిన రైతులు రాష్ట్రంలో 11.02 లక్షల మంది ఉన్నట్లుగా తేల్చారు. 5ఎకరాల నుంచి 10ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు 4.44 లక్షల మంది ఉండగా, 10నుంచి 25 ఎకరాల్లోపు 94వేల మంది, 25 ఎకరాలకుపైగా భూములు ఉన్న బడా రైతులసంఖ్య 6488గా ఉంది. అయితే ఇందులో 100 ఎకరాలకు మించిన రైతులకు చెక్కులు ఇచ్చేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి రైతుబంధు సాయం నిరాకరించింది. తెలంగాణ రాష్ట్రంలో మిగులు భూముల (సీలింగ్‌ ల్యాండ్స్‌ యాక్టు) చట్టం ప్రకారం ఒక్కో కుటుంబానికి 54 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉండాలని నిబంధన ఉంది. అంతకుమించితే అది సీలింగ్‌ ల్యాండ్‌గా పరిగణిస్తారు. దీంతో వీరికి చెక్కుల పంపిణీ నిలిపివేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement