Tuesday, March 19, 2024

Big Story: మ్యాజిక్ ఫిగర్‌తో సరిపెట్టలేం.. రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా సంఖ్యాబలమే కీలకం

(స్వరూప పొట్లపల్లి, ఆంధ్రప్రభ ఢిల్లీ బ్యూరోచీఫ్) : ఉత్తర్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అనేక సవాళ్లు విసురుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి బొటాబొటి మెజారిటీ సాధించడమే గగనంగా మారిన ప్రతికూల పరిస్థితుల్లో భారీ మెజారిటీ కోసం శ్రమించాల్సిన పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. జరుగుతున్న పరిణామాలతో అధైర్యపడకుండా, ప్రతి సీటులోనూ గెలుపు కోసం శ్రమించాలంటూ కమలదళపతులు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుక్కారణం ఈ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా చెప్పుకోవడం మాత్రమే కాదు, ఈ ఏడాదిలోనే వెంటవెంటనే జరగనున్న రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలు.

రాజ్యసభ ఎన్నికలు: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డ తర్వాత జరిగే మొట్టమొదటి ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలే. ఈ 5 రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో కలిపి ఏప్రిల్ నెలలో 5 స్థానాలు, జులై నాటికి మరో 14 స్థానాలు కలిపి మొత్తంగా 19 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి నిర్వహించే ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీలో సాధించే సంఖ్యాబలమే కీలకం. పంజాబ్ రాష్ట్రంలో ఏప్రిల్ 9న ఐదు స్థానాలకు పదవీకాలం ముగుస్తుండగా, జులై 4తో మరో ఇద్దరి పదవీకాలం ముగియనుంది. ఈ ఏడుగురిలో ముగ్గురు కాంగ్రెస్, ముగ్గురు శిరోమణి అకాలీదళ్, ఒకరు బీజేపికి చెందినవారున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పార్టీలు సాధించే సంఖ్యాబలం ఆధారంగా రాజ్యసభ పదవులు వారికి దక్కనున్నాయి.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక రాజ్యసభ సీటుకు జులై 4 పదవీకాలం ముగుస్తుంది. ప్రస్తుతం ఆ సీట్లో కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ టమ్ట ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచి అధికారం సాధిస్తుందో, రాజ్యసభ సీటు కూడా ఆ పార్టీకే దక్కనుంది. ఉత్తర్ ప్రదేశ్ (11): దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో జులై 4న ఏకంగా 11 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఐదుగురు అధికార బీజేపీ ఎంపీలు కాగా ముగ్గురు సమాజ్‌వాదీ, ఇద్దరు బీఎస్పీ, ఒకరు (కపిల్ సిబల్) కాంగ్రెస్‌కు చెందినవారున్నారు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో రాజ్యసభలో ఎక్కువ సీట్లు సాధించాలంటే అసెంబ్లీలోనూ ఎక్కువ సీట్లు సాధించాల్సిందే.

రాష్ట్రపతి ఎన్నికలు: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్ట్రోరల్ కాలేజి ఓట్లు అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తాయి. రాష్ట్రపతిని ఎన్నుకునేవారిలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, అన్ని రాష్ట్రాల్లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు (ఎమ్మెల్యేలు) ఉంటారు. అయితే ఇందులో అందరి ఓటు విలువ ఒకేలా ఉండదు. 1971 జనాభా లెక్కలను అనుసరించి, ఆయా రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్ర జనాభాను మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే ఓటు విలువ. ఆ ప్రకారం చూసినా సరే 1971 నాటికే అత్యధిక జనాభా కల్గిన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ (208) ఎక్కువ. ఎమ్మెల్యేల ఓటు విలువ ప్రకారం ఆ తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ (176), తమిళనాడు (176), మహారాష్ట్ర (175), బిహార్ (173) ఉన్నాయి. ఇందులో బిహార్ మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ బీజేపీ వ్యతిరేక శక్తులే అధికారంలో ఉన్నాయి. సంఖ్యాబలం కూడా ఆ పార్టీలకే ఎక్కువగా ఉంది. లోక్‌సభలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ, యూపీ అసెంబ్లీ నుంచి తోడయ్యే బలమూ బీజేపీ గెలుపోటములను నిర్ణయించగలదు.

అందుకే ఉత్తర్‌ప్రదేశ్ సహా ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకంగా మారాయి. పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటి గెలిస్తే చాలని చాలా పార్టీలు భావిస్తాయి. కానీ బీజేపీ బొటాబొటి మెజారిటీ సాధిస్తే చాలదని ఖరాఖండిగా చెబుతోంది. గెలుపు అందుకోడానికే ఎన్నో సవాళ్లు ఎదురవుతున్న ప్రతికూల వాతావరణంలో, భారీ ఆధిక్యంతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తోంది. 2017లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన భారీ ఆధిక్యం వెనుక ప్రధాని మోదీ వేవ్ ప్రధాన కారణంగా నిలిచింది. ఆనాడు ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా.. కేవలం మోదీ ముఖంతోనే ప్రచారం నిర్వహించారు. కానీ ఇప్పుడు ముఖాలు మారాయి. యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖం ప్రధానంగా కనిపిస్తోంది. యూపీలో యోగి ఆరంభం నుంచే తన మార్కును ప్రదర్శిస్తూ వచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించే మాఫియా డాన్లు, క్రిమినల్ గ్యాంగులను వరుసపెట్టి ఎన్‌కౌంటర్లు చేస్తూ ఎన్‌కౌంటర్ రాజ్ అనే పేరు తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను యూపీలో విస్తృతంగా అమలు చేశారు.

- Advertisement -

ఏదేమైనా.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మోదీ-యోగి ముఖాలతో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రచారం చేసుకుంటున్నా.. అనుకూల, ప్రతికూలతలను యోగీయే ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికితోడు ఐదేళ్ల ప్రభుత్వ రిపోర్టు కార్డును కూడా ఓటర్లు పరిశీలిస్తున్నారు. అభివృద్ధి, పనితీరు గురించి పెద్దగా విమర్శలు లేకున్నా.. వ్యవహారశైలి గురించి యోగి విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే నిరుద్యోగం, కరోనా కారణంగా దెబ్బతిన్న ఉపాధి, పెరిగిన నిత్యావసరాల ధరలు వంటి ప్రతికూలాంశాలు కూడా యోగికి సవాళ్లు విసురుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో కొందరు పెద్ద నేతలు పార్టీని వీడడంతో కొత్త సవాల్‌ తలెత్తింది. ముఖ్యంగా ఓబీసీ వర్గం, కొంత వరకు బ్రాహ్మణ నేతలు యోగి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2017లో సాధించిన భారీ విజయంలో ఈ రెండు వర్గాల భాగస్వామ్యం చాలా కీలక పాత్ర పోషించింది. నాయకులు పార్టీలు మారడానికి వ్యక్తిగత కారణాలున్నప్పటికీ, ఈ వలసల ప్రభావం ఎన్నికలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నడుమ గెలుపు అంత సులభం కాదని కమలనాథులకు అవగతమవుతున్నా.. గెలిచి తీరడమే కాదు, భారీ మెజారిటీ సాధించాల్సిందేనన్న పట్టుదల కనిపిస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement