Monday, March 25, 2024

మాస్క్ లేకుండా బయటకెళ్తే.. అంతే!

ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తగిన జాగ్ర్తత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. మాస్క్, భౌతిక దూరం, శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలని చెబుతోంది. ముఖ్యంగా బయటకు వచ్చేవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటోంది. కానీ కొందరు మాత్రం ప్రభుత్వ సూచనల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. బయటకు వచ్చినవారు ఎవరైనా మాస్కులు పెట్టుకోకపోతే జరిమానా విధించాలని ఆదేశించింది.

అయినా మాస్కుల పట్ల కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మాస్క్ లేకుండా సంచరించే వారిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మాస్క్ పెట్టుకోకుండా పట్టుబడుతున్ధ వారికి 100 రూపాయలు చొప్పున ఫైన్ విధిస్తున్నారు పోలీసులు. కాకినాడ‌ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద  తనిఖీలు  ప్రారంభించిన  గంటలో.. మాస్క్ లేకుండా 50 మంది పట్టుబడ్డారు. కాకినాడ‌లో మాస్క్ లు  లేకుండా సంచరించే వారిపై చర్యలకు  ఐదు బృందాలతో అధికారుల విస్తృత తనిఖీలు చేస్తున్నారు. వాహనాలు, బస్సులు తనిఖీ చేసి..  మాస్క్ లేని వారికి వంద రూపాయల ఫైన్ వేసి.. కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మాస్క్ ధరించని వారికి నగరంలో వంద రూపాయలు, రూరల్ గ్రామాల్లో యాభై  రూపాయల జరిమానా విధిస్తున్నారు.

కరోనా నుంచి రక్షణ కోసం మాస్కులు వేసుకోవాలని, బయటికి వెళ్ళేటప్పుడు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.  కరోనా నివారణ కోసం అందరూ మస్కులు తప్పనిసరిగా ధరించి మీ ఆరోగ్యం మరియు ఇతరుల ఆరోగ్యానికి దోహదపడండని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement