Tuesday, April 23, 2024

తొలి దశ పోలింగ్ ప్రశాంతం

పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో జరిగిన తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బెంగాల్ లో తొలి విడతలో భాగంగా 30నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 79.79 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 191 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. తొలి దశ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలు ఎక్కువగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. పురులియా, ఝార్గామ్ జిల్లాల్లోని అన్ని స్థానాలు.. బంకుర, మెదినీపుర్, పశ్చిమ మెదినీపుర్, పుర్బా జిల్లాల్లో కొన్ని స్థానాల్లో ఓటింగ్ జరిగింది.

పోలింగ్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తిన క్రమంలో భద్రత కట్టుదిట్టం చేశారు. సువేందు అధికారి సోదరుడు సోమేందు అధికారి కారుపై కాంటాయ్ ప్రాంతంలో దాడి చేశారు. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. టీఎంసీనే దాడికి పాల్పడినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై ఈసీకి ఆపార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ రిగ్గుంగు పాల్పడిందని ఆరోపించారు.

అటు అసోం అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 72.14శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన జనం.. కరోనా నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 47 స్థానాల్లో 264 మంది అభ్యర్థుల బరిలో నిలిచారు. అసోం సీఎం సోనోవాల్ మజులీ స్థానం నుంచి ఈ దఫా ఎన్నికల్లో నిలిచారు. శాసనసభ సభాపతి హితేంద్రనాథ్ గోస్వామి జోరాట్ నుంచి, పీసీసీ అధ్యక్షుడు రిపున్ బోరా గోపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచారు. ఇక, బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో విడత ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనున్నాయి. బెంగాల్ లో 30, అసోంలో 39 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement