Wednesday, April 24, 2024

కరీంనగర్ లో హైడ్రామా.. జాగరణ దీక్ష భగ్నం.. బండి సంజయ్‌ అరెస్ట్

ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరీంనగర్‌లోని తన కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టిన బండిని హైడ్రామా మధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడ్డుకున్న కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

అంతకుముందు.. జాగరణ దీక్ష చేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించగా… దీక్షకు మద్దతుగా జిల్లాల నుంచి వస్తున్న నాయకుల్ని పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో అక్కడ ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ బైక్‌పై కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన వారి నుంచి తప్పించుకుని లోపలికి వెళ్లి దీక్ష చేపట్టారు. రాత్రి 8 గంటల సమయంలో దీక్ష ప్రారంభం కాగా, కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పార్టీ నేతలు మూసివేశారు.ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తల్ని నిలువరించిన పోలీసులు… కార్యాలయ గేటు తాళాన్ని పగలగొట్టారు.  రాత్రి 10.30 గంటలకు తలుపులు, అద్దాలు బద్దలుకొట్టి.. లోపలికి వెళ్లి సంజయ్‌ను బలవంతంగా అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ తలకు గాయమైంది.  అరెస్ట్ చేసిన సంజయ్‌ను మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అక్కడ కూడా ఆయన దీక్ష కొనసాగించినట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement