Thursday, April 25, 2024

Telangana | బైక్​ ట్యాక్సీలను బ్యాన్​ చేయాలే.. ప్రభుత్వానికి ఆటో, కారు యూనియన్ల లేఖ

ఆటో, కారు ట్యాక్సీలకు పోటీగా రాపిడో వంటి బైక్​ ట్యాక్సీలు నడుస్తున్నాయి. దీంతో మా ఉపాధి దెబ్బతింటోంది. అయితే.. ప్రభుత్వానికి రోడ్డు పర్మిట్లు, పన్నులు, లైసెన్స్ ఫీజు, ఇన్సూరెన్సూ రూపంలో పెద్దమొత్తంలో చెల్లిస్తున్నాం. ఎలాంటి ట్యాక్సులు కట్టకుండా రోడ్లపై తిరిగే బైక్​ ట్యాక్సీలతో ప్రభుత్వ ఆదాయానికీ గండిపడుతోంది. అందుకని హైదరాబాద్​ సిటీతో పాటు తెలంగాణలో అక్రమంగా ట్రాన్స్​పోర్ట్​, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే  బైక్​ ట్యాక్సీలను బ్యాన్​ చేయాలి.. అని ఆటో, కారు ట్యాక్సీ యూనియన్లు ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశాయి.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హైదరాబాద్​తో పాటు పలు పట్టణాలు, సిటీల్లో అక్రమంగా నడుస్తున్న బైక్​ ట్యాక్సీలను రద్దుచేయాలన్న డిమాండ్​ వినిపిస్తోంది. ఈ మేరకు ఇవ్వాల (శుక్రవారం) తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), తెలంగాణ స్టేట్ టాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్‌టీడీజేఏసీ) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. బైక్ టాక్సీలుగా నడుపుతున్న ప్రైవేట్ మోటార్‌బైక్‌ల వినియోగాన్ని నిలిపివేయాలని ఈ లేఖలో సంఘం ప్రతినిధులు కోరారు. TGPWU, రాష్ట్ర అధ్యక్షుడు, చైర్మన్ (TSTDJAC) షేక్ సలాహుద్దీన్ శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు రాసిన లేఖలో రాపిడో వ్యాపారం, ఆటో రిక్షా.. క్యాబ్ డ్రైవర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని పేర్కొన్నారు.

బైక్ టాక్సీ సేవలకు తక్కువ చార్జీల కారణంగా ఆటో రిక్షాలు, క్యాబ్ డ్రైవర్లకు డిమాండ్​ తగ్గుతోందని, దీంతో పెద్ద ఎత్తున నష్టపోతున్నట్టు మంత్రికి రాసిన లేఖలో సలావుద్దిన్​ తెలిపారు. ఈ ప్రైవేట్ యాజమాన్యంలోని బైక్ ట్యాక్సీలు రోడ్డు పర్మిట్లు, పన్నులు.. లైసెన్స్ ఫీజులు లేకుండానే ట్రాన్స్​పోర్ట్​ బిజినెస్​ చేస్తున్నట్టు వారు తెలిపారు. వాణిజ్య వాహనాన్ని నడపడానికి తప్పనిసరి పన్నులు, రోడ్డు పర్మిట్లు, లైసెన్స్​ ఫీజులు చెల్లించాలని.. ఇవన్నీ చెల్లించిన తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోందని డ్రైవర్ JAC పేర్కొంది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో రాపిడో, ఓలా, ఉబర్‌ ప్లాట్​ఫాంపై వాహనాలు నడుపుతున్న బైక్ టాక్సీ సర్వీసులు, ప్రైవేట్ లైసెన్స్ ఉన్న వాహనాలను ట్యాక్సీలుగా ఉపయోగించడానికి అనుమతి లేదని, దీంతో ఈ బైక్​ ట్యాక్సీలను అక్రమ వ్యాపారంగా పరిగణించాల్సి ఉంటుందన్నా వారు పేర్కొన్నారు.

- Advertisement -

రైడ్-హెయిలింగ్ అప్లికేషన్‌లు మోటార్‌బైక్ యజమానులు తమ వాహనాలను టాక్సీలుగా నడపడానికి అనుమతిస్తున్నాయని, ఇది మోటారు వాహనాల చట్టానికి (MV చట్టం, 1989 యొక్క రూల్ 50, 51) విరుద్ధంగా నడుస్తోందన్నారు. ఇక.. టాక్సీ క్యాబ్‌ల రిజిస్ట్రేషన్ మార్క్ పసుపు రంగు బోర్డుపై నలుపు రంగు అక్షరాలు ఉండాలని, కానీ, పర్సనల్​ బైకులను ట్యాక్సీలు నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని వారు రాసిన లేఖలో పేర్కొన్నారు.

కాగా, ఇట్లాంటి బైక్​ ట్యాక్సీలను కర్నాటక, చెన్నై, మహారాష్ట్రలోని RTOలు (ప్రాంతీయ రవాణా కార్యాలయం) గత జనవరి చివరి వారంలో దాదాపు 120 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారని, ఓలా మోటో, ఉబర్ మోటో, రాపిడోగా నడుపుతున్న ప్రతి వాహన యజమాని నుంచి 10వేల నుండి 15వేల రూపాయల వరకు జరిమానా విధించినట్టు వారు తెలిపారు.

అదేవిధంగా.. పుణే RTO బృందం 2022 ఫిబ్రవరి మొదటి వారంలో ఆ సిటీలో టాక్సీ సేవలను అందించే 65 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకుందని, ఆర్‌టీఓలు బైక్‌ ట్యాక్సీ డ్రైవర్లను అరెస్టు చేసి, వారు నిర్వహిస్తున్న కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ప్రధాన డిమాండ్లు..

  • ‌‌తెలంగాణలో బైక్ ట్యాక్సీలుగా నడుస్తున్న ప్రైవేట్ మోటార్‌ బైక్‌లను  నిషేధించాలని వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.
  • తెలంగాణలో బైక్ టాక్సీలు, డెలివరీ కోసం కొత్త వాహనాలను అటాచ్ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తక్షణ CAP (వాహన లక్షణాలను వివరించే ప్రత్యేకమైన 20-అక్షరాల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్ నిర్మాణం) కూడా ఉండాలి.
  • రాపిడో, ఓలా, ఉబర్ బైక్ టాక్సీ కార్యకలాపాలు మోటారు వాహనాల చట్టాన్ని అనుసరించాలి.
  • సిటీ రోడ్లపై బైక్ టాక్సీలు కమర్షియల్‌గా నడపడానికి రిజిస్ట్రేషన్‌ను ఈ ప్రొవైడర్‌లు తక్షణమే ప్రారంభించాలి.
  • తెలంగాణలోని బైక్ ట్యాక్సీ యజమానులపై విధించే పెనాల్టీల ఖర్చును రాపిడో, ఓలా, ఉబర్‌ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఆదేశించాలని కోరారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement