Wednesday, April 24, 2024

పాఠశాల గోడలపై రోత రాతలు.. అశ్లీల చిత్రాలను పాఠాలుగా బోధిస్తున్నారా ?

ప్రభుత్వ పాఠశాలలో గోడలపై అశ్లీల వీడియోల వెబ్‌సైట్‌తో రాసిన రాతలు ముక్కున వేలేసుకునేలా చేశాయి. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని పెగడపల్లి ప్రభుత్వ జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో కార్యాలయం గోడలకు అశ్లీల వెబ్‌ సైట్‌ రాతలు చర్చనీయాంశంగా మారాయి. శనివారం పాఠశాల ఆవరణలో జిల్లా విద్యాధికారి మాధవి, ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య సాక్షిగా పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన పాత్రికేయులకు ఇలాంటి రాతలు దర్శనమివ్వడంతో క్లిక్‌ మనిపించారు. దీనిపై పాఠశాలలో చదువుతున్న ఆడపిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి పాఠశాల కార్యాలయం గోడపై దర్శనం ఇచ్చినప్పటికీ మధ్యాహ్నం వరకు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాల బోధన చేస్తున్నారా ? లేక అశ్లీల చిత్రాల వీడియోల పాఠాలు బోధిస్తున్నారా ? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ మండలంలో ఒకరిద్దరు ఉపాధ్యాయులు విద్యార్థులతో లైంగిక సంబంధాలు పెట్టుకుని, వారిని వేధించిన సంఘటనలు సైతం ఉన్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధుల సాక్షిగా కార్యక్రమానికి హాజరైనప్పటికీ ఉపాధ్యాయులు బేఫికర్‌గా పట్టించుకోవడం లేదంటే ఆ పాఠశాలలో ఉపాధ్యాయుల తీరు ఎలా ఉందో అర్థమవుతోందని మండిపడుతున్నారు.

దీనిపై ఉపాధ్యాయులను వివరణ కొరగా ఎవరో ఆకతాయిలు రాశారని, అది మాకు తెలియదన్నారు. అయితే ఉదయం నుండి గోడపై రాతలను ఎందుకు చేరిపేయలేదంటే మాత్రం సమాధానం దాటవేస్తున్నారు. ఉపాధ్యాయుల నడవడికపై పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర అసహనంతో ఉన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement