Thursday, April 25, 2024

Bad News: ఎంపీడీవో వేధింపులు.. భ‌ర్త‌తో స‌హా టీఆర్ఎస్ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

సొంత పైస‌ల‌తో ఊళ్లో ప‌నులు చేయిస్తే అధికారులు బిల్లులు ఇవ్వ‌కుండా వేధిస్తున్నార‌ని టీఆర్ఎస్ పార్టీ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో జ‌రిగింది. సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండలం అడ్లూరు సర్పంచ్‌ గా స్వాతి కొనసాగుతున్నారు. ఆమె టీఆర్ ఎస్‌ తరపునే పోటీచేసి సర్పంచ్ గా గెలిచారు. సర్పంచ్ గా కొనసాగుతున్న ఆమెకూ వేధింపులు త‌ప్ప‌లేదు. అప్పులు చేసిమరీ గ్రామంలో అభివృద్ది పనులు చేపడితే బిల్లులు చెల్లించకపోవడమే కాదు.. ఇతర విషయాల్లోనూ అధికారులు వేధించడంతో తట్టుకోలేకపోయిన సర్పంచ్ స్వాతి భర్తతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

సర్పంచ్ గా ఎన్నికయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పిలుపుమేరకు అప్పుచేసి పల్లె ప్రగతి. వైకుంఠధామాల నిర్మాణం వంటివి చేప‌ట్టామని అడ్లూర్ సర్పంచ్ స్వాతి తెలిపారు. ఈ పనులకు సంబంధించిన రూ. 2.50లక్షల బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఇది చాలదన్నట్లు ప‌లు కండిష‌న్స్ పేరుతో స్థానిక ఎంపీడీవో వేధింపులకు పాల్ప‌డుతున్నాడ‌ని స్వాతి ఆరోపించారు. గ్రామపంచాయతీలో ట్రాక్టర్‌, ట్రాలీ ట్యాంకర్‌ కి ఇన్సూరెన్స్‌, రిజిస్ట్రేషన్లు చేయలేద‌ని ఎంపీడీవో, కార్యదర్శి త‌న‌కు మొమోలు ఇచ్చార‌ని సర్పంచ్ తెలిపారు.

బిల్లులు చెల్లింపు ఆలస్యం, ఎంపీడీవో వేధింపులను తట్టుకోలేక ఎంపీడీవో ఆఫీసు ఎదుట సర్పంచ్ స్వాతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్తతో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి య‌త్నించారు. అయితే వెంటనే కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. సర్పంచ్ స్వాతి చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎంపీడీవో స్పందించారు. ఆమెపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని… మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు మెమోలు జారీ చేశామన్నారు. ఇక అన్ని గ్రామ పంచాయితీల్లో చేపట్టిన పనులకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని… త్వరలోనే చెల్లింపులు చేస్తామ‌ని ఎంపీడీవో స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement