Monday, June 5, 2023

పోల్ దంగల్.. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు!

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక బెంగాల్, అస్సాంలో మూడో దశ ఎన్నికలు నిర్వహించేందుకు ఈ సి అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోడీ సహా రాజకీయ ప్రముఖులు కోరారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. మొత్తం 234 నియోజకవర్గాల్లో 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. విజయంపై అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే విశ్వాసంగా ఉన్నాయి. తమిళ రాజకీయాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు కరుణానిధి, జయలలిత. రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర ప్రజల్లో వారిది చెరగని ముద్ర. అలాంటిది.. ఎన్నో దశాబ్దాల తర్వాత.. ఈ దిగ్గజ నేతలు లేకుండా తొలిసారి పూర్తిస్థాయి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే హ్యాట్రిక్​ కొడుతుందా? డీఎంకే అధికారాన్ని దక్కించుకుంటుందా? లేక కమల్​ హాసన్​, దినకరన్​ పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయి? వంటి అంశాలు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పోలింగ్​ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు కొవిడ్-19 నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకున్నామన్నాని చెప్పారు. మే 2న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.

- Advertisement -
   

కేరళ పోరు కీలక ఘట్టానికి చేరింది. మొత్తం 140 శాసనసభ స్థానాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్​ జరగనుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని జాగ్రత్తల నడుమ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ సాగనుంది. ప్రచారం ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్​ కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 140 నియోజకవర్గాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్​ నిర్వహించనుంది ఈసీ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్​డీఎఫ్​, కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా… భాజపా కూడా కీలకంగా మారాలని చూస్తోంది. మే 2న ఫలితాలు వెల్లడించనున్నారు.

సీపీఎం నేతృత్వంలోని అధికార వామపక్ష ప్రజాస్వామ్య వేదిక(ఎల్​డీఎఫ్​) మరోసారి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది. ఐదేళ్లకు ఓసారి అధికారం మారే సంప్రదాయానికి ఈ దఫా చెక్​ పెట్టాలని చూస్తోంది. సీఎం పినరయి విజయన్​ గత ఐదేళ్లలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆయన హయాంలోనే రాష్ట్రాన్ని రెండేళ్లు వరదలు ముంచెత్తాయి. నిఫా వైరస్‌, తర్వాత కొవిడ్‌ మహమ్మారి వంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి అంశాలు రాష్ట్రాన్నీ కుదిపేశాయి. ఈ నేపథ్యంలో లో ఇ ఈసారి ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పుదుచ్చేరిలో మంగళవారం శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మొత్తం 30 స్థానాల్లో 324 మంది అభ్యర్థలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బంగాల్ శాసనసభ ఎన్నికల మూడో విడత పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం 31 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 205 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అసోం శాసనసభ ఎన్నికల చివరి దశ పోలింగ్ మంగళవారం జరగనుంది. 40 స్థానాల్లో మొత్తం 337 మంది అభ్యర్థలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం మీద ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై అందరి దృష్టి పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement