Friday, April 19, 2024

Bonalu : ఈనెల 22 నుండి ఆషాఢ బోనాలు.. మంత్రి తలసాని

హైద‌రాబాద్ : ఈనెల 22వతేదీ నుండి ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఉత్సవాలకు వారం ముందే ఆలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం అందజేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులతో బోనాల ఉత్స‌వాల‌పై మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల ఉత్స‌వాల నేప‌థ్యంలో సుమారు 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుంద‌న్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డిలు కూడా పట్టువస్త్రాలను సమర్పిస్తారని, ఏర్పాట్లు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. ఈనెల 22 న గోల్కొండ బోనాలు, జులై 9 న సికింద్రాబాద్ బోనాలు, 16 వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని వివరించారు.

బోనాల ఉత్సవాలకు లక్షలాదిమంది వస్తారని, దానిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆద్వర్యంలోని వివిధ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ పరిధిలో లేని దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గత సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలో 3039 దేవాలయాలకు ఆర్థిక స‌హాయం అందజేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రభ్యత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలకు వారం ముందే దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆలయ కమిటీల నిర్వహకులు కూడా వీలైనంత త్వరగా దరఖాస్తులను అధికారులకు అందజేయాలని మంత్రి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement