Friday, April 26, 2024

ఏపీలో కొత్త‌ జిల్లాలు – ఎన్టీఆర్ పేరు పెట్టే ఆలోచ‌న‌లో సీఎం జ‌గ‌న్ !

ఆయ‌న యాక్ట‌రే కాదు, తెలుగు వారికి ఇల‌వేలుపు కూడా. రాజ‌కీయాల్లో న‌టుల హ‌వా ఎలా ఉంటుందో చాటిచెప్పిన మ‌హానీయుడు. న‌ట‌న‌లోనే కాదు , రాజ‌కీయాల్లో కూడా త‌న‌దైన‌ముద్ర‌ని వేసుకున్నారు సీనియ‌ర్ న‌టుడు, దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు. కాగా త్వర‌లోనే ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈనేప‌థ్యంలో ప్ర‌జ‌లు, ఎన్టీఆర్ అభిమానులు సంతోషించ‌ద‌గ్గ నిర్ణ‌యాన్ని తీసుకుంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం. ఎన్టీఆర్ క్రిష్ణా జిల్లా వాసి. అఖిలాంధ్రుల ముద్దు బిడ్డ. అందువల్ల రాజకీయాలకు అతీతంగా ఆయన శత జయంతి వేళ ఏపీ సర్కార్ ఏదైనా బృహత్తర కార్యక్రమం తలపెడితే అది తెలుగు జాతికే గర్వంగా ఉంటుంది. కాగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్, ఎన్టీఆర్ అభిమాని అన్నది తెలిసిందే. అందుకే ఎన్టీయార్ శత జయంతి వేళ ఆయనకు భారీ గిఫ్ట్ నే జగన్ రెడీ చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా అన్న గారికి సరైన అంజలి ఘటించాలన్నది కూడా సీఎం జగన్ ఆలోచన అని స‌మాచారం. ఏపీలో ఎన్టీఆర్ పుట్టిన క్రిష్ణా జిల్లాను రెండుగా విభజించనున్నారు. అలా విభజించిన తరువాత ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా అన్న గారి కీర్తిని శాశ్వతం చేయాలని జగన్ యోచ‌న చేస్తున్నార‌ట‌. ఆ విధంగా ఎన్టీఆర్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంటూనే, రాజకీయంగా కూడా టీడీపీ మీద పై చేయి సాధించాలన్నది వైసీపీ ఎత్తుగడ వేస్తోంది. చంద్రబాబు ఇప్పటికే పద్నాలుగేళ్ల పాటు సీఎం గా వ్యవహరించారు కానీ, ఆయన ఏ రోజూ ఎన్టీఆర్ పేరిట సాలిడ్ గా ఒక కార్యక్రమం చేయలేదని వైసీపీ నేతలు విమ‌ర్శిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తనయ పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఉండగా పార్లమెంట్ లో అన్న గారి విగ్రహం ఏర్పాటు చేయించారు అన్నది తెలిసిందే. అది కూడా కాంగ్రెస్ ఏలుబడిలో సాగింది. ఇపుడు జగన్ హయాంలో ఎన్టీయార్ పేరిట ఒక కొత్త జిల్లా వస్తే ఆ సామాజికవర్గం నుంచి ఎంతో కొంత సానుకూలత వైసీపీకి టర్న్ అవుతుంది. దీనివ‌ల్ల జ‌గ‌న్ పేరు మారుమోగ‌డం ఖాయం. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement