Friday, March 29, 2024

ఏపీ కేబినెట్‌ భేటీ వాయిదా.. కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మరోసారి వాయిదా పడింది. గురువారం జరగాల్సిన సమావేశాన్ని మే 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీఎంఓ ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వు జారీ చేశారు.  మే 4వ తేదీన సచివాలయంలోని 1న బ్లాక్ కేబినెట్ మీటింగ్ హాల్లో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉంది. అజెండా కోసం మంత్రులు వేచి చూస్తున్న తరుణంలో మంత్రిమండలి సమావేశం వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా పడినట్లు ఉత్తర్వు వెలువడింది.

కాగా, కేబినెట్ మీటింగ్ వాయిదా పడటం ఇది రెండోసారి. తొలుత ఈనెల 22 మంత్రివమండలి సమావేసముంటుందని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత సమావేశాన్ని నేటికి( ఏప్రిల్ 29) వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. ఐతే సమావేశం వాయిదా పడటానికి కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులపై మరింత లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునేందుకే కేబినెట్ వాయిదా పడిందన్న చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొర‌త వెంటాడుతుండ‌గా.. వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేయ‌డంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించ‌నుంది. రికార్డు స్థాయిలో పెరుగుతున్న క‌రోనా రోగుల‌కు అందుతున్న వైద్య స‌దుపాయాల‌తోపాటు ఆక్సిజ‌న్, బెడ్లు, రెమిడెసివిర్ కొర‌త వంటి అంశాల‌పై కేబినెట్ భేటీలో చర్చించాలని సీఎం జగన్ భావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement