Monday, January 30, 2023

ఒక భూమి పుత్రుడి మరో చరిత్ర.. అప్పుడు ఎమర్జెన్సీ, ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ

తన కలలను పండించుకొనే నేర్పున్న శక్తి తాను స్వప్నించిన దాన్ని సాధించే దాకా నిద్రపోని వ్యక్తి తను పుట్టిన జన్మభూమిపై అంతులేని భక్తి రాజకీయ ప్రత్యర్థులను సైతం ఔరా అనిపించగల యుక్తి కలగలిస్తే నిజమయ్యే నిజమైన భూమి పుత్రుడి రూపం కేసీఆర్. తెలంగాణ అస్తిత్వాన్ని పునః ప్రతిష్ఠించి.. ఆత్మ గౌరవ జయ పతాకను ఎగురవేసి.. అభివృద్ధి సవ్వడులలో తన ప్రాంతీయులను ఓలలాడించి పరిపాలన అంటే ఇదీ అని యావత్‌ దేశానికి చూపించిన భూమి పుత్రుడు కేసీఆర్‌.. మరో చరిత్ర సృష్టించడానికి నడుం కట్టి నడువబోతున్నాడు.

దేశ ప్రజలు భావోద్వేగాల సుడిలో చిక్కి.. భయమనే జడిలో నక్కి.. తడబడుతున్న తరుణంలో మన మార్గం ఇదికాదు.. మన గమ్యం అభివృద్ధి.. మన మార్గం మహనీయుల యాది.. అని గుర్తుచేస్తూ కేసీఆర్‌ దేశ రాజకీయ యవనికపై అడుగిడనున్నారు. ఉజ్వల భారతం వైపు పరుగిడాల్సిన భారతం.. సరిగ్గా ఎనిమిదేండ్లలో 50 ఏండ్లు తిరోగమించింది. 2022లో 1977ను తలపిస్తున్న సన్నివేశంలో నాటి లోకనాయకుడి తరహాలోనే నేటి జననేత జాతి చైతన్యం కోసం విజయానికి సంకేతమైన దసరా పర్వదినాన పాంచజన్యం పూరిస్తున్నారు.

- Advertisement -
   

దాదాపు అర్ధ శతాబ్దం కిందటి భారతదేశం.. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ 352 స్థానాల అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చి.. తూర్పు పాకిస్తాన్‌కు విముక్తి కల్పించి బంగ్లాదేశ్‌ ఏర్పాటు చేసిన సందర్భం. నాడు ఇందిరే ఇండియా.. ఇండియానే ఇందిర అనేంతగా ఆధిపత్యం చెలాయించిన వేళ! ప్రస్తుతం.. పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసి.. దేశమంతా భావోద్వేగం రగిలించి.. 2019 ఎన్నికల్లో 303 స్థానాల భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ.. నేడు మోదీయే ఇండియా.. ఇండియానే మోదీ.. అంటూ భ్రమల్లో ముంచెత్తుతున్న స్థితి. ప్రత్యామ్నాయం కనిపించడం లేదని భావిస్తున్న దుస్థితి! నాడు ఇందిరాగాంధీది పరిపాలనా నియంతృ త్వం.. నేడు మోదీ ఆధిపత్య నిరంకుశత్వం.. నాడు రాయ్‌బరేలీ నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ కోర్టు తీర్పు ఇచ్చినందుకు 1975లో అత్యవసర పరిస్థితిని విధించి 21 నెలల పాటు తీవ్రమైన అణచివేత చర్యలకు పా ల్పడిన పరిస్థితి.

తన రాజకీయ ప్రత్యర్థులను.. ప్రతిపక్ష నేతలను మూకుమ్మడిగా జైళ్లలో బం ధించడం.. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ఉక్కుపాదంతో తీవ్రంగా అణచివేయడం.. పత్రికలపై సెన్సార్‌షిప్‌ విధించడం.. ఇదీ ఆనాటి మ హాభారతం!! ఇప్పుడూ అదే దృశ్యం.. కాకపోతే మరింత తీవ్రంగా! రాచరికపు అరాచక వ్యవస్థలను సైతం కాలదన్ని పాశవిక ఆధిపత్య ధోరణి ప్రబలిపోయింది. ఎమర్జెన్సీ లేదు.. కానీ.. అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నది. రాజకీయ ప్రత్యర్థులపై, ప్రతిపక్ష నేతలపై జైళ్లను మించిన అణచివేత చర్యలను ప్రయోగించడం.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను జాగిలాల మాదిరిగా ఉసిగొల్పి దాడి చేయించి ఉక్కిరిబిక్కిరి చేసి దారికి తెచ్చుకోవ డం.. మీడియాపై సెన్సార్‌ షిప్‌ కంటే.. ఏకంగా మీడియానే కొనేసి దొడ్లో కట్టేయడం. రాష్ర్టాలను.. ప్రాంతీయ పార్టీలను బలహీనం చేసి అధఃపాతాళానికి తొక్కేయడం.. ఇదీ నేటి భార తం. అప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు. నాడు తనకు తిరుగులేని మెజార్టీ ఉన్నదన్న ధీమాతో ఇందిరాగాంధీ ఏకపక్ష నియంతృత్వ పోకడలకు పో యారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ప్రభుత్వ అవినీతి, అధిక ధరలు.. ప్రజల ప్రాథమిక హక్కుల హరణ వంటి చర్యలతో దేశం అట్టుడికిపోయింది.

ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ
ఇప్పుడు మోదీ రెండాకులు ఎక్కువే చదివారు. పరిపాలనను వ్యాపారంగా మార్చిపారేశారు. నియంత్రణ లేని ధరలు.. దోపిడీ పన్నుల వ్యవస్థ, హద్దులు దాటిన అవినీతి దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఏకంగా రాష్ర్టాల హక్కులను హరించేస్తున్నారు. రాజ్యాంగం రాష్ర్టాలకు నివేదించిన అంశాలను సైతం కేంద్రం నిరంకుశంగా లాక్కుంటున్నది. ఇందిరాగాంధీని మించి దేశంలో సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగించారన్న అపఖ్యాతిని మోదీ మూటగట్టుకున్నారు. మరోవైపు ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమైంది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా తమ తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, అన్ని వర్గాలను నిరంతర అభద్రతాభావానికి దేశ భద్రతకు ప్రమాదం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్ల పబ్బం గడుపుకోవడం మోదీ మార్కు పాలనగా మారింది.

కునారిల్లిపోయిన కాంగ్రెస్‌
నాడు కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలతో రెండు పార్టీలుగా చీలిపోయింది. పార్టీలో ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు పోటీ పడుతున్న సమయమది. చివరకు ఇందిరాగాంధీయే పార్టీ ని హస్తగతం చేసుకొన్నారు. ఇవాళ జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నది. మోదీ అధికారంలోకి రావడానికి ముం దు వరకూ ఎంతో బలంగా ఉన్న పార్టీ ఒక్కసారిగా కోలుకోలేని స్థాయిలో బలహీనపడింది. సీనియర్‌ నాయకత్వం అంతా పార్టీకి దూరమై న పరిస్థితి. ప్రాంతీయ పార్టీలూ బీజేపీని దీటు గా ఎదుర్కోలేకపోతున్నాయి. దీంతో జాతీయ రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. బలమైన ప్రత్యామ్నాయమంటూ లేకుండా పోయింది.

1977లోనూ అదే శూన్యత
నాడు అత్యవసర పరిస్థితిని తొలగించి, 1977లో ఎన్నికలకు వెళ్లిన సందర్భంలో దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇందిరను ఎదుర్కోవడానికి ఒకే ఒక్కడు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ మొదటి అడుగు వేశారు. దేశంలో సంపూర్ణ క్రాంతి రావాలని నినదించాడు. ఆయన ఇచ్చిన పిలుపునకు యావత్‌ దేశం స్పందించింది. 1977 ఎన్నికల్లో 271 స్థానాలతో జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగింది. నాడు జేపీ తెచ్చిన సంపూర్ణ క్రాంతి.. 50 ఏండ్ల పాటు దేశ రాజకీయాలపై ప్రభావం చూపించింది. ఆ ఉద్యమంలోనుంచి అనేకమంది యువ నేతలు అవతరించారు. జేపీ బాటలో పలువురు నేతలు కేంద్రంలో పలు ప్రభుత్వాల్లో అత్యంత కీలక పాత్ర పోషించారు. రాష్ర్టాల్లో పరిపాలన సాగించారు. ఇప్పటికీ ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకొంటూ పాలన చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా చర్చ
కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనపై యావత్‌ దేశం ఆసక్తిగా చూస్తున్నది. దేశంలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్‌ జాతీయ పార్టీని స్వాగతిస్తూ పలు రాష్ర్టాల్లో పోస్టర్లు వెలిశాయి. పలు జాతీయ చానళ్లు ఈ పరిణామంపై ఆసక్తికరమైన కథనాలు ప్రసారం చేస్తున్నాయి. కొన్ని చానళ్లు కౌంట్‌డౌన్‌ కూడా నిర్వహిస్తున్నాయి. జాతీయ పార్టీ ప్రకటన.. అనంతర పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. సామాజిక మాధ్యమాల్లోనూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు.

అదే చరిత్ర మళ్లీ!
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొంటే.. 2022 సంవత్సరం 1977గా మారిందనిపిస్తుంది. నాడూ.. నేడూ అదే నియంతృత్వం.. నిరంకుశత్వం.. అదే రాజకీయ శూన్యత.. వెనక్కి పోయిన అభివృద్ధి. మోదీ నిరంకుశత్వాన్ని నిలువరించే బలమైన ప్రత్యామ్నాయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌వారికి దారీతెన్నూ కనిపించని పరిస్థితి. ఈ దశలో దేశానికి వెలుగు చూపించడం కోసం తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అడుగులు వేశారు. నాడు జేపీ సంపూర్ణ క్రాంతి నినాదం ఇచ్చినట్టే.. నేడు కేసీఆర్‌ బీజేపీ ముక్త్‌ భారత్‌ నినాదంతో సమరశంఖం పూరించారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం తన ఆలోచనలకు మరింత పదునుపెడుతూ దేశవ్యాప్తంగా పర్యటించి తన విజన్‌ను రాజకీయ పార్టీలు, ఆర్థిక, సామాజికవేత్తలు, మేధావి వర్గాలతో విస్తృతంగా చర్చించి పంచుకొన్నారు. ఈ మేధోమథనం నుంచి ఉద్భవించిన జాతీయ పార్టీకి విజయానికి సంకేతమైన పవిత్ర దసరా పర్వ దినాన అంకురార్పణ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రసమితిని జాతీయ పార్టీగా రూపాంతరం చేయనున్నారు.

2001-2022 అదే బీజేపీ-అదే కేసీఆర్‌
తెలంగాణ ఆత్మగౌరవం.. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. ఇప్పుడు దేశ హితం కోసం కేసీఆర్‌ పిడికిలి బిగిస్తున్నరు. కాకతాళీయమో..కాలమహిమో అప్పుడూ ఇప్పుడూ రెండు సందర్భాల్లోనూ కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉన్నది. నాడు ప్రధానిగా బీజేపీ అగ్రనేత వాజ్‌పేయి ఉండగా.. నేడు ప్రధానిగా మోదీ ఉన్నారు. 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు రాజకీయ బలం లేదు. పైగా టీఆర్‌ఎస్‌ ఉపప్రాంతీయ పార్టీగా తెలంగాణ గడ్డపై ఉద్భవించింది. ఈ పార్టీని ‘మఖలో పుట్టి.. పుబ్బలో మాయం’ అవుతుందన్నారు. కానీ తెలంగాణను సాధించి అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలిపారు. నేడు జాతి హితం కోసం తెలంగాణే మాడల్‌గా, తెలంగాణే స్ఫూర్తిగా విజయదశమి పర్వదినం నాడు శంఖారావం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement