Thursday, April 25, 2024

ఎపిలో జ‌ల‌ ర‌వాణాకు జోష్ ..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత పటిష్టపరిచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నా రు. అందులో భాగంగా జల మార్గాన్ని రాష్ట్రం లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలని యోచిస్తున్నారు. అందుకోసం ప్రత్యే కంగా ఆంధ్రప్రదేశ్‌ జలమార్గ ప్రాథికార సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సంస్థ దేశీయ జల రవాణాకు అనుసంధానంగా పని చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందు కోసం రాష్ట్ర పరిధిలో 8మందితో బోర్డును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వీరిలో ఐదుగురు ప్రభుత్వం నుండి ప్రతినిధులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతంలోని 978 కీ.మీ.తోపాటు సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న కృష్ణా, గోదావరి నదులు, వాటికి అనుసంధానంగా ఉన్న వివిధ కాలువ లతో కలిపి సుమారుగా 1555 కీమీ పొడవున రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలుపుకుంటూ జల రవాణాను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబో తుంది. అందుకు సంబంధించిన బిల్లును కూడా ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం కూడా తెలిపారు. ప్రత్యేకంగా కార్యాల య ఏర్పాటు, అందుకు సంబంధించిన సిబ్బంది జీతభత్యాలకు కొంత నిధులను కూడా కేటా యించబోతున్నారు. ఇందుకోసం ప్రాథమికం గా రూ. 58.86 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కార్యాలయాల నిర్వహణ, ఓడరేవుల కార్యకలాపాలు, జీతభత్యాలకు రూ. 40.60 కోట్లు వెచ్చించబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ దేశీయ జలమార్గం ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఏపీలోని దేశీయ జల రవాణా (ఐడబ్ల్యూటీ) ప్రోత్సహించడం, ఇదే సందర్భంలో జాతీయ జలమార్గం అభివృద్ధిచేసి ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని రవాణాను మరింత ముందుకు నడిపించడమే ముఖ్య ఉద్దేశ్యం. అందులో భాగంగా ఏపీ తీర ప్రాంతాన్ని మరింత పటిష్టంచేస్తూ ఆదిశగా బోర్డు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేలా ప్రణాళికలను రూపొందించారు. ఈప్రక్రియ అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా సరుకు రవాణా మరింత సులభతరం కానున్నది.

1555 కీమీ అభివృద్దే లక్ష్యంగా ఏర్పాటు
తడ నుండి ఇచ్ఛాపురం వరకూ సుమారు 978 కీమీ సముద్ర తీర ప్రాంతం ఏపీ పరిధిలో ఉంది. గతంలో వీటి పరిధిలో బకింగ్‌ హామ్‌ కెనాల్‌ ద్వారా జల రవాణా చేపట్టేవారు. కాలక్రమేణా బకింగ్‌ హామ్‌ అటకెక్కింది. దీంతో కేవలం పోర్టుల నుండి మాత్రమే నేరుగా రైలు, రోడ్డు మార్గం ద్వారా సరుకు రవాణాను చేపడుతూ వస్తున్నారు. ఈప్రక్రియవల్ల వ్యయ భారం పెరగడంతోపాటు దూరాభారం కూడా మరింత పెరుగుతుంది. సకాలంలో సరుకును కూడా కొన్ని సందర్భాల్లో గమ్యం చేర్చలేకపోతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే జల రవాణాను పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా జాతీయ స్థాయిలో జల రవాణా కొన్ని ప్రాంతాల్లో కొంత మేర అందుబాటులోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఆదిశగా సేవలు అందుబాటులో లేవు. ఈనేపథ్యంలో సీఎం జగన్‌ జల రవాణా వైపు దృష్టి సారించారు. సముద్ర తీర ప్రాంతంతోపాటు నదులు, వివిధ కాలువలను అనుసంధానంచేస్తూ ఆవసరమైన ప్రాంతాల్లో జల రవాణాను అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. అందుకోసం ఇప్పటి వరకూ ప్రాథమికంగా 1555 కీమీ జల రవాణాను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

బోర్డు ఏర్పాటు ఇలా
ఈ ప్రాథికార సంస్థ పర్యవేణకోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, సీఈవోతోపాటు ప్రభుత్వ పరిధిలో ఐదు మంది సభ్యులు నియమించబోతున్నారు. మొత్తం ఎనిమిది మందితో కలిపి బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. అందుకు అవసరమైన కసరత్తు కూడా శరవేగంగా జరుగుతుంది. వారికి ప్రత్యేక అధికారాలను కూడా ఇవ్వబోతున్నారు. వివిధ నిర్ణయాలు తీసుకునే సమయంలో బోర్డు ఛైర్మన్‌ అధ్యక్షత వహించి అందరి ఆమోదంతో అవసరమైన చర్యలు తీసుకుంటారు. వీరికి నిర్ణీత పదవీ కాలాన్ని కూడా నిర్ణయించారు. అదేవిధంగా బోర్డులో సభ్యులను తొలగించేందుకు కూడా ఛైర్మన్‌కు కొన్ని అధికారాలను కట్టబెట్టబోతున్నారు.

- Advertisement -

రాష్ట్రంలో జల రవాణాను అందుబాటులోకి తేవడమే ఉద్దేశ్యం
రాష్ట్రంలో జల రవాణాను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ లక్ష్యాలను ఆచరణలో అమలుపర్చేలా బోర్డును కూడా ఏర్పాటు చేయబోతుంది. జల రవాణాకు అవసరమైన అన్ని చర్యలను ఇక బోర్డు చూసుకుంటుంది. గుర్తించిన ప్రాంతాల్లో జల రవాణాకు అవసరమైన పనులను చేపట్టడం, అవసరమైన ప్రాంతాల్లో నిర్మాణాలను చేపట్టడం వంటి పనులు చేయనుంది. పడవలు, బోట్లు ద్వారా 100 టన్నుల లోపు సామర్ధ్యం కలిగిన సరుకులను నిర్దేశించిన ప్రాంతానికి తీసుకురావడం, అక్కడ నుండి జల రవాణాకు అనుసంధానంగా ఉన్న ప్రాంగణానికి తరలించడం ఇలా కాలువలు, నదులు, సముద్ర ప్రాంతాన్ని కలుపుతూ రవాణాను అందుబాటులోకి తేబోతున్నారు. ఈప్రక్రియలో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో మరికొన్ని ఓడ రేవులను నిర్మించడం ప్రస్తుతం ఉన్న ఓడ రేవులను జలరవాణా సంస్థకు అనుసంధానంగా పనిచేసేలా ప్రణాళికలు ఏర్పాటు చేయబోతున్నారు. వీలైనంత త్వరలో ఈ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వివిధ రకాల వస్తువులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న వివిధ రకాల ఉత్పత్తులను త్వరితగతిన జలమార్గం ద్వారా ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేలా ఈ మార్గాన్ని సులభతరం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement