Wednesday, April 24, 2024

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే!

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. మహమ్మారి కట్టడిపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది. సచివాలయంలో ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాల సమాచారం. కరోనా కట్టడికి పాక్షిక కర్ఫ్యూ, ఆస్పత్రుల్లో పడకల పెంపు, వ్యాక్సినేషన్ వంటి కీలకమైన అంశాలపై  కేబినెట్ లో చర్చించనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆంక్షలు సడలిస్తూ.. మిగతా సమయం అంతా 144 సెక్షన్ విధించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. ఆస్పత్రుల్లో బెడ్స్ పెంపు, ఆక్సిజన్ సరఫరా, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియపైనా నిర్ణయాలు తీసుకోనుంది. 18-45 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సినేషన్ కోసం నిధుల కేటాయింపుపైనా కేబినెట్ ఆమోదం తెలపనుంది.

విశాఖలో ప్రభుత్వ అతిథి గృహాలను పర్యాటక శాఖ ద్వారా నిర్మించే అంశంపైనా చర్చించనుంది. విశాఖలోని కైలాసగిరి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ పర్యాటక ప్రాజెక్టుల పేరిట రాష్ట్ర అతిథిగృహాల నిర్మాణం చేపట్టే కీలకమైన అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. మొత్తం 8 ప్రాజెక్టుల నిర్మాణం కోసం పర్యాటకశాఖ కేబినెట్ ​కు ప్రతిపాదించింది. బీచ్ రోడ్ అభివృద్ధి, రిషికొండ, గ్రేహౌండ్స్ కొండ, తొట్లకొండ, బే పార్క్ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి బిడ్ల ఖరారుపై ర్యాటిఫికేషన్​కు కేబినెట్‌ లాంఛనంగా ఆమోదాన్ని తెలియచేయనుంది. భూసేకరణలో ఎస్సీ, ఎస్టీలకు 10 శాతం అదనంగా పరిహారం ఇచ్చే ప్రతిపాదన చర్చకు రానుంది. అర్చకుల వేతనాల పెంపు ప్రతిపాదనలకూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రైవేటు వర్సిటీలు 35 శాతం మేర సీట్లు కన్వీనర్ కోటాలో ఇచ్చేలా ప్రతిపాదనలకూ అంగీకరించే అవకాశముంది. విశ్వవిద్యాలయాల్లో స్థానిక, నాన్ లోకల్ సీట్ల కేటాయింపులపై కొత్తగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement