Thursday, September 23, 2021

తెలంగాణ జలియన్‌ వాలాబాగ్‌.. అక్కడేం జరిగింది?

తెలంగాణలోని పరకాలలో నిజాం పాలన కాలంలో జరిగిన మారణ హోమానికి నేటికి 74 ఏళ్లు పూర్తిచేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక, నిజాం రాజ్యంలోనూ జాతీయ పతాకం ఎగురవేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. వాటిని అణగదొక్కేందుకు రజాకార్లు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల వీరోచిత పోరాటానికి నిలువెత్తు నిదర్శనం ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలోని అమరధామం.

పరకాలలో నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు ఇక్కడ మారణ హోమానికి పాల్పడ్డారు. ఇది జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని తలపించిందని చెబుతుంటారు చరిత్రకారులు. తెలంగాణ సాయుధపోరాట చరిత్రలో నిలిచిపోయిన రక్తపుమరక. బ్రిటిష్‌ సైన్యం దేశభక్తులపై విచక్షిణారహితంగా కాల్పులు జరిపి వందలమందిని పొట్టనపెట్టుకున్న జలియన్‌ వాలాబాగ్‌ నరమేధాన్ని పోలిన ‘తెలంగాణ జలియన్‌ వాలాబాగ్‌’ ఘటన.

1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం, రజాకార్ల పాలనలోనే ఉంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో తిరుగుబాటు మొదలైంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న పరకాలలో జాతీయ పతాకం ఎగురవేయలని నిర్ణయించారు. కానీ, వారిపై రజాకార్లు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఘటనలో అక్కడి వాళ్లు 22 మంది అమరులు అయ్యారు.

దేశానికి స్వాతంత్ర్యం రావడంతో 1947 సెప్టెంబర్ 2న జాతీయ పతాకం ఎగురవేసేందుకు చుట్టు పక్క గ్రామాల నుంచి వందల సంఖ్యలో జనాలు చాపల బండ చేరుకున్నారు.  చేతుల్లో జాతీయ పతాకాలు రెపరెపలాడుతుండగా, వందేమాతరం, నిజాం వ్యతిరేక నినాదాలు మిన్నంటుతున్నాయి. వారు జాతీయ పతాకాన్ని ఎగరేయాల్సిన మైదానం సమీపంలోకి రాగానే నిజాం పోలీసులు, రజాకార్లు విరుచుకుపడ్డారు. ఓవైపు కాల్పులు, మరోవైపు పారిపోతున్నవారిపై కత్తులతో దాడి.. చూస్తుండగానే రణరంగమైందా ప్రాంతం. 15 మంది అక్కడికక్కడే చనిపోగా, పారిపోతూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మరో ఎనిమిది మంది అసువులుబాశారు. చాలా మంది గాయాలపాలయ్యారు. ఇది పాశవిక నిజాం సైన్యం సృష్టించిన నరమేధం. సరిగ్గా నేటికి 74 ఏళ్లు పూర్తిచేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో కచ్చితంగా గుర్తుచేసుకోవాల్సిన ఘటన ఇది.  

ఖాసిం రిజ్వీ నేతృత్వంలో తెలంగాణ అంతటా రజాకర్ల ఆగడాలకు దిగారు. అయితే, ఆ తర్వాత భారత సైన్యం తెలంగాణను దేశంలో విలీనం చేసుకునేందుకు ఆపరేషన్ పోలో చేపట్టింది. 1948 సెప్టెంబరు 13న ప్రారంభమైన ఆపరేషన్ పోలో… సెప్టెంబర్ 17న నిజాం సైన్యం లొంగిపోవడంతో ముగిసింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందే ఈ పరకాల ఘటనకు సంబంధించి కొన్నేళ్ల క్రితం వరకు పరకాలలో కనీసం స్మారకం కూడా లేదు. అప్పట్లో చిన్నస్తూపం, చనిపోయినవారి పేర్లతో ఫలకం మాత్రం ఏర్పాటుచేశారు. కేంద్ర సహాయమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ నేత, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు తన తల్లి పేరిట ఉన్న ట్రస్టు ఆధ్వర్యంలో ఇక్కడ ఓ స్మారకాన్ని నిర్మించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ఆరోజు చేయిచేయి పట్టుకుని మానవహారంగా వచ్చిన అమరవీరులకు గుర్తుగా అక్కడ ర్యాలీగా వెళ్తున్నట్లుగా మనుషుల బొమ్మలు ఏర్పాటు చేయించారు.  

ఇది కూడా చదవండి: జన హృదయ విజేత.. నేడు వైఎస్ వర్ధంతి!

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News