Thursday, April 25, 2024

వ్య‌వ‌సాయ పున‌ర్జీవ ల‌క్ష్యం – భూక‌మ‌తాల ఏకీక‌ర‌ణ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో పట్టాదారుల సంఖ్య పెరుగుతోంది. వ్యవసాయ భూముల విస్తీర్ణంతోపాటు కొత్త ఆయకట్టు పెరుగుతోంది. అదే సమయంలో గుంట భూమికి కూడా రైతుబంధు అందిస్తూ సర్కార్‌ రైతుకు అండగా నిలవడంతో నానాటికీ వ్యవసాయ కమతాల విస్తీర్ణంలో తగ్గుదల నమోదవుతున్నది. దీంతో వ్యవసాయ యోగ్యతకు భవిష్యత్‌లో ఇబ్బందులు రానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా గాంధీజీ కలలుకన్న భూ కమతాల ఏకీకరణ వంటి కీలక నిర్ణయాలకు తెలంగాణ రాష్ట్రం వేదికగా నిలిచేందుకు కార్యాచరణ చేస్తోంది. స్వాతంత్య్రానంతరం ఏ రాష్ట్రం కలలో కూడా ఊహించని రీతిలో నూతనత్వ విధానాలను అందిపుచ్చుకుంటూ ప్రత్యేకతతో ముందడుగు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం భూ కమతాల పెంపు వంటి వాటితో వ్యవస్థకు మరింత మెరుగులు దిద్దుతోంది.
చిన్నపాటి భూ కమతాలతో వ్యవసాయానికి ప్రయోజనం లేదన్నది వందల ఏండ్లుగా వ్యక్తమవుతున్న అభిప్రాయమే… అయితే ఏ ప్రభుత్వమూ… పాలకులూ కూడా కమతాల ఏకీకరణకు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా పెద్దపెద్ద విస్తీర్ణంలో ఉన్న భూ కమతాల సంఖ్య గుంటలకు పడిపోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భూ కమతాల ఏకీకరణ దిశగా దృష్టి సారిస్తోంది. ఇందుకు అనువుగా భూ కమతాల ఏకీకరణ చట్టం-1956ను తెలంగాణ ప్రభుత్వం సవరించింది.

వ్యవసాయ సాగువిస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా తగ్గుముఖం పడుతూ ఆహారధాన్యాలకు కొరత ముప్పు తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. తాజాగా తెలంగాణ సర్కార్‌ చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయానికి డిమాండ్‌ పెరిగింది. కొత్తగా కోటి ఎకరాల స్థిరీకరణ వంటి పనులు విజయవంతమవుతున్నాయి. ఇదే సమయంలో కొందరు చిన్నకారు రైతులు తమ భూములు వ్యవసాయానికి అనువుగా లేకపోవడడం, చిన్నచిన్న విస్తీర్ణాలలో చేసే సాగుకు పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ భూములను దళారులకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లేదంటే పక్క రైతులకు అమ్ముకుంటున్నారు. దీంతో వ్యవసాయ రంగంలో చిన్న రైతుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితులను కమతాలఏకీకరణతో చెక్‌ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశలోనే భూ కమతాల ఏకీకరణకు వీలుగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. చిన్నచిన్న కమతాలను ఏకం చేయడంలో భాగంగా రైతులకు అనేక ప్రయోజనాలను కలిగించింది. తద్వారా భూ వివాదాల నివారణ, సాగు విస్తీర్ణం పెంచుకోవచ్చని యోచిస్తోంది. తద్వారా రెండు వేర్వేరు సర్వే నంబర్లలోని ఒకే రైతుకు చెందిన భూములను ఒకే సర్వే నంబర్‌ కిందకు చేరేలా అవకాశం కల్పించింది. ఇద్దరు రైతులు పరస్పరం చేసుకునే భూ మార్పిడికి రిజిస్ట్రేషన్‌ రుసుమును మినహాయించడం కూడా రైతులకు ప్రోత్సాహం కలిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement