Tuesday, April 16, 2024

బొగ్గు దిగుమ‌తుల‌తో అదానికి లాభాల పంట – మ‌న‌కు న‌ష్టాలు తంటా..

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – ఏ దేశంలోనైనా విద్యుత్‌ సగటు వ్యక్తిగత వినియోగం ఆ దేశ నాగరికతను ఆ దేశ పౌరులు పొందుతున్న ఆధునిక సదుపాయాలకు అద్దంపడు తుంది. సగటు విద్యుత్‌ వినియోగం అధికంగా ఉన్న దేశాల్ని అభివృద్ది చెందిన ఆర్ధిక వ్యవస్థలుగా ప్రపంచం పరిగణిస్తోంది. భారత్‌లో 2021 జూలై 7వ తేదీన ఆలిండియా పీక్‌ అవర్‌ విద్యుత్‌ డిమాండ్‌ 200.539 గిగావాట్లుగా నమోదైంది. అంతకుముందెప్పుడూ దేశంలో ఈ స్థాయి విద్యుత్‌ వినియోగం జరగలేదు. 2022ఏప్రిల్‌ 26న పీక్‌ అవర్‌ డిమాండ్‌ 201.066 గిగావాట్లకు చేరింది. కాగా 2023 ఏప్రిల్‌లో ఇది ఏకంగా 229 గిగావాట్లకు చేరే అవకాశాల్ని విద్యుత్‌ సంస్థలు అంచనాలేస్తున్నాయి.

భారత్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో గరిష్ట వాటా బొగ్గు ఆధారిత సంస్థలదే. ఈ ఏప్రిల్‌లో 229 గిగావాట్ల విద్యుత్‌ డిమాండ్ తట్టుకోవాలంటే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్నుంచి 193గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలి. దీన్ని అంచనాలేసిన కేంద్రం ఈ స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గులో కనీసం 15శాతాన్ని తప్పనిసరిగా విదేశాల్నుంచి దిగుమతి చేసుకోవాల్సిందేనంటూ ఆంక్షలు విధించింది. కొత్త ఆర్ధిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా విద్యుత్‌ ధరల్ని పరోక్షంగా పెంచుతూ అన్ని రెగ్యులరేటరీ కమీషన్లు ఆదేశాలు జారీ చేశాయి. ఇది దేశవ్యాప్తంగా విద్యుత్‌ వినియోగదార్లపై అదనపు భారంగా పరిణమించ నుంది. ఈ దశలో విదేశాల్నుంచి అధిక ధరపై బొగ్గును దిగుమతి చేసుకోవాలన్న నిబంధన ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు కూడా అదనపు భారమౌతుంది. ఇందుకనుగుణంగా విద్యుత్‌ ధరల్ని పెంచి పంపిణీ సంస్థలకు అమ్ముకునే వెసులుబాటును కూడా కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకు ప్రైవేటు విద్యుత్‌ సంస్థల్నుంచి కొనుగోళ్ళకు గరిష్ట ధర యూనిట్‌కు 12 రూపాయలు ఉండగా ఇప్పుడు దాన్ని 50రూపాయల వరకు పెంచుకుని అమ్ముకోవచ్చని కేంద్రం అనుమతించింది. తమ అవసరాలకనుగుణంగా ఈ మేరకు ధరలు పెంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలని పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

అసలే ధరలు మండిపోతున్నాయి. నిత్యావసరాలు నింగినంటాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరింది. ప్రజల కొన ుగోలు శక్తి పడిపోయింది. అనూహ్యంగా దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. బియ్యం, పప్పులు, నూనెలు, ఇతర ఆహార దినుసులను కూడా సామాన్యులు కొనలేక సతమతమౌతున్నారు. ఈ దశలో కేంద్ర నిర్ణయాలు విద్యుత్‌ ధరల పెంపునకు దారితీస్తాయి. అధిక ధరతో ప్రైవేటు ఉత్పత్తిదార్ల నుంచి కొనుగోలు చేశామంటూ పంపిణీ సంస్థలు వినియోగదార్ల నుంచి ట్రూఅప్‌ చార్జీలు వ సూలు చేస్తాయి. ఇప్పుడు విద్యుత్‌ కూడా ఓ నిత్యావసరంగా మారింది. విద్యుత్‌ లేకుండా ఓ నిమిషం కూడా గడవని పరిస్థితి నెలకొంది. సామాన్యుల్నుంచి సంపన్నుల వరకు విద్యుత్‌కు అలవాటుపడ్డారు. ఈ నెల నుంచి విద్యుత్‌ భారం అధికం కానుంది. ఇక ప్రభుత్వాలు పేద రైతుల కోసం అమలు చేస్తున్న ఉచిత వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల భారం తడిసిమోపెడౌతోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో డజన్ల సంఖ్యలో ఎత్తిపోతల పథకాలు అమలౌతున్నాయి. ఇవన్నీ విద్యుత్‌ ఆధారంగానే నిర్వహించబడుతున్నాయి. వీటికి సరఫరా చేసే విద్యుత్‌ విలువ అమాంతం పెరిగిపోతోంది. వాస్తవానికి ఈ విద్యుత్‌ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. గ తంలో ఎత్తిపోతలకయ్యే విద్యుత్‌ వ్యయానికి వీటి ద్వారా సాగయ్యే వ్యవసాయ ఉత్పత్తుల విలువకు మధ్య పొంతన ఉండేది. కానీ ఇప్పుడు విద్యుత్‌ వ్యయంతో పోలిస్తే ఉత్పత్తుల విలువ చాలా తక్కువ. అయినా ప్రభుత్వం నిత్యావసరాల్ని ప్రజలకు అందుబాటులో పెట్టడంతో పాటు రైతులకు సాగు, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ విద్యుత్‌ బిల్లుల భారాన్ని భరిస్తున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో ప్రభుత్వాలు భరించాల్సిన ఉచిత విద్యుత్‌ భారం ఇతర సంక్షేమ పథకాలకు కేటాయింపుల్ని నిర్వీర్యపర్చే ప్రమాదముంది.

దేశీయ బొగ్గు ఉత్పత్తికి కొరవడ్డ సహకారం :
బొగ్గు మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల మేరకు భారత్‌లో 31,900కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. 2019-20లో దేశీయంగా 73.08కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. 2020-21లో 71.60కోట్ల టన్నుల బొగ్గును వెలికి తీశారు. 2022-23లో 77.73కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తి, వినియోగాల్లో చైనా తొలి స్థానంలో ఉంటే భారత్‌ రెండో స్థానంలో ఉంది. భారత్‌ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా 70శాతంగా ఉంది. దేశీయంగా జార్ఖండ్‌, ఒడిస్సా, చత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణా మహరాష్ట్రల్లో అతిపెద్ద బొగ్గు గనులున్నాయి. వీటన్నంటిని కలిపి కోల్‌బెల్ట్‌గా పిలుస్తారు. ఇవికాక ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ , మేఘాలయా, అస్సోం, సిక్కిం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో కూడా బొగ్గు గనులున్నాయి. అలాగే కోల్‌ ఇండియాతో పాటు సింగరేణికాలరీస్‌ వంటి బొగ్గు ఉత్పాధక సంస్థలకు సమృద్దిగా నిధులు, యంత్రాలు, కార్మికశక్తి అందుబాటులో ఉంది. ఉత్పత్తి పెంచేందుకు ఈ సంస్థలు కేంద్రం నుంచి అనుమతులు కోరుతున్నాయి. కానీ విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలన్న ఆలోచనతో కేంద్రం ఇందుకు అనుమతులివ్వడంలేదు.

- Advertisement -

రష్యా నుంచి భారీగా దిగుమతి :
అమెరికా, ఐరోపా ఆదేశాల ఆంక్షల్తో సతమతమౌతున్న రష్యా నుంచి చమురు, గ్యాస్‌లతో పాటు బొగ్గును కూడా భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరల కంటే 30శాతం తక్కువకే రష్యా భారత్‌కు సరఫరా చేస్తోంది. అయితే భారత్‌లోని ఉక్కు, చక్కెర కర్మాగారాలకు మాత్రమే రష్యా నుంచి బొగ్గు దిగుమతికి కేంద్రం అనుమతులిచ్చింది. విద్యుత్‌ ఉత్పాధక సంస్థలకు మాత్రం రష్యా నుంచి దిగుమతులకు అనుమతించడంలేదు.

అదానీ సంస్థల ప్రయోజనం కోసమే :
2023మార్చిలో కోల్‌ ఇండియా 20మిలియన్‌ టన్నుల బొగ్గును విదేశాల్నుంచి దిగుమతి చేసుకుంది. ఇందులో 17.30మిలియన్‌ టన్నులు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నుండి కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా నుంచి అదానీ బొగ్గు గనుల్నుంచి ఈ దిగుమతి సాగింది. కాగా ఇది దేశీయంగా ఉత్పత్తవుతున్న బొగ్గు ధరకంటే చాలా ఎక్కువ. కోల్‌ ఇండియా, సింగరేణి తదితర సంస్థలు సగ టున టన్ను బొగ్గును 5వేల చొప్పున జెన్‌కోకు విక్రయిస్తున్నాయి. కాగా అదానీ సంస్థ నుంచి టన్ను 13,100రూపాయల చొప్పున కోల్‌ ఇండియా, జెఎన్‌కోలు దిగుమతి చేసుకుంటున్నాయి. దేశీయ బొగ్గులో గ్రాస్‌ కేలోరిఫిక్‌ వ్యాల్యూ సుమారు 4వేలు కాగా దిగుమతి చేసుకుంటున్న బొగ్గులో దీని విలువ 6,500. దేశీయ బొగ్గుతో పోలిస్తే గ్రాస్‌ కెలోరిఫిక్‌ వ్యాల్యూ కొంతమేర ఎక్కువైనా ఇక్కడి బొగ్గు ధరకంటే 160శాతం అధికంగా చెల్లించి బొగ్గును దిగుమతి చేసుకోవడం విద్యుత్‌ ఉత్పాధక వ్యయంపై పెనుభారం మోపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బొగ్గు ధర టన్ను 9వేలకు చేరింది. ఇందుకు ప్రధాన కారణం యూరోప్‌ దేశాలకు ప్రధాన బొగ్గు ఎగుమతిదారైన రష్యా నుంచి సరఫరా నిల్చిపోవడమే. ఈ దేశాలిప్పుడు చైనా, అమెరికా, ఫ్రాన్స్‌, ఇతర దేశాల్నుంచి బొగ్గును కొనుగోలు చేస్తున్నాయి. లేనిపక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఈ ధర 5వేల రూపాయల్లోపే ఉండేది. కాగా అంతర్జాతీయ మార్కెట్‌ ధర కంటే కూడా 50శాతం అధికంగా చెల్లించి అదానీ సంస్థ నుంచి భారత్‌ బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. ఈ నిర్ణయం అదానీకి చెంది నష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా బొగ్గు గనుల్ని లాభాల బాటలోకి నెడుతుంది. అంతేకాదు… దేశీయంగా ప్రధాన పోర్టులన్నీ అదానీ అధీనంలోనే ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి ద్వారా ఈరేవులకు భారీ ఆదాయం సమకూరుతుంది.

గ్యాస్‌ సరఫరాలేక మూతబడ్డ యూనిట్లు :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013వరకు నిర్వహణలో ఉన్న నాలుగు గ్యాస్‌ ఆధారిత ప్రైవేటు విద్యుత్‌ ప్రాజెక్టులు మూతబడ్డాయి. కాకినాడ సమీపంలోని కేజిబేసిన్‌ నుంచి రిలయన్స్‌ వెలికితీస్తున్న సహజవాయువును స్వేచ్ఛా మార్కెట్లో వేలం ద్వారా విక్రయించుకునే హక్కును కేంద్రం కల్పించింది. దీంతో స్థానిక విద్యుత్‌ ఉత్పాధక సంస్థల మూసివేత తప్పలేదు. అదే సమయంలో కేజి బేసిన్‌లో ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వరంగ సంస్థ ఒఎన్‌జిసి చేసిన విజ్ఞప్తిని కేంద్రం అనుమతించలేదు. గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ సంస్ధల మూసివేతతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలపైనే ఆధారపడాల్సొస్తోంది. ఇదిలా ఉంటే బొగ్గు మూల ధరపై కేంద్రం 12శాతం రాయల్టిగా వసూలు చేస్తుంది. బొగ్గు అమ్మకంపై ఐదుశాతం జిఎస్‌టిగా, టన్నుకు 400 గ్రీన్‌ ఎనర్జీ సెస్‌గా ఇదికాక జాతీయ మైనింగ్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ పన్ను, మినరల్‌ ఫౌండేషన్‌ చార్జీ, పర్యావరణ సెస్‌, వికాస్‌ ఉపకార లెవి ఇలా.. పలురకాల పన్నుల్ని బొగ్గుపై వసూలు చేస్తోంది. ఇవన్నీ కూడా విద్యుత్‌ ధరల పెంపునకు దారితీస్తున్నాయి.

అన్నిరంగాలపై పెనుభారం :
అధిక ధరలకు విదేశాల్నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవడం, అలాగే గరిష్టంగా యూనిట్‌కు 50 రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేయడం వంటి చర్యల భారం అన్నిరంగాల్ని కుదిపేస్తుంది. తొలుత ఈ భారం పంపిణీ సంస్థలపై పడుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2021-22లో విద్యుత్‌ కొనుగోళ్ళ వ్యయ సర్దుబాటు క్రింద వినియోగదార్ల నుంచి రూ. 3,083కోట్లు వసూలు చేశాయి. అలాగే పీక్‌టైమ్‌ ఓవర్‌లోడ్‌ పేరిట మరో 3,232కోట్లు ముక్కు పిండి రాబట్టాయి. ఇది వినియోగదార్లు ఎప్పుడో వాడేసిన విద్యుత్‌కు సంబంధించి చెల్లించాల్సొచ్చిన అదనపు మొత్తం. అలాగే విద్యుత్‌ ధరల పెంపుతో పారిశ్రామికరంగం విలవిల్లాడుతోంది. ఉత్పాధక వ్యయం పెరుగుతోంది. ఇది వినిమయ మార్కెట్‌లో ధరల పెంపునకు దారితీస్తోంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగి ప్రజల ఆర్ధిక శక్తి క్షీణిస్తున్నది. అదానీ బొగ్గు గనుల సంస్థను నష్టాల ఊబి నుంచి బయటపడేసే లక్ష్యంతో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం 140కోట్ల భారతీయులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement