Saturday, April 20, 2024

సుప్రీం కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారానికి సిద్ధం.. చీఫ్ జస్టిస్ రమణ

సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలకు తాను సిద్ధంగా ఉన్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జర్నలిస్ట్‌ల కోసం సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ యాప్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానంలో జరిగే కార్యకలాపాలు పారదర్శకంగా ఉండేందుకు సాంకేతికంగా ముందుకెళ్లాలని భావించినట్లు సీజేఐ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలన్నీ ప్రత్యక్ష ప్రసారాలకు తాను సిద్ధంగా ఉన్నట్లు చీఫ్ జస్టిస్ వెల్ల‌డించారు. ఈ విషయంపై సహ న్యాయమూర్తులతో చర్చించి రాబోయే రోజుల్లో కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశామ‌ని వివ‌రించారు.

ఒక జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు త‌న‌కు ఇప్పటికీ గుర్తున్నాయని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కోర్టు వార్తల కోసం వారు పడుతున్న బాధలు తమకు తెలుసని తెలిపారు.  జస్టిస్‌ ఖన్విల్‌కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ధనుంజయ్‌ల కమిటీ ఈ యాప్‌ను రూపకల్పన చేసినట్లు తెలిపారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుప్రీంకోర్టు సాంకేతిక బృందం దీన్ని రూపొందించినట్లు జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. సుప్రీంకోర్టు రోజువారీ కార్యకలాపాలను జర్నలిస్టులు ఇకపై ఉన్న చోటు నుంచే రిపోర్ట్‌ చేసేందుకు ఈ అవకాశం కల్పించామని పేర్కొన్నారు. మీడియా, సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం, వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు సీజేఐ ప్రకటించారు. అక్రిడిటేషన్ల మంజూరులో ఎవ‌రికీ అన్యాయం జ‌ర‌గ‌కుండా చర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: తెలంగాణలో లాక్‌డౌన్.. టీఆర్ఎస్ నేతలకు వర్తించదా?

Advertisement

తాజా వార్తలు

Advertisement